రేపో, ఎల్లుండో నన్ను అరెస్టు చేస్తారు.. చంద్రబాబు

రేపో, మాపో తనను అరెస్టు చేస్తారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడులు కూడా చేస్తారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టిస్తోందని విమర్శించారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి తనపై 26 దర్యాప్తులు జరిపించి విఫలమయ్యారని గుర్తుచేశారు.
ఇప్పుడు ఏదో కంపెనీ పేరుతో తనపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని, వాళ్ల డబ్బులు కూడా ఇస్తామని చెబుతున్నారని ఐటి నోటీసులపై ప్రస్తావిస్తూ ఆరోపించారు.  ప్రజాసమస్యలపై మాట్లాడితే రౌడీలతో దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాయదుర్గంలో పల్లె ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ మాజీ మంత్రి వివేకానందరెడ్డిని సొంత బంధువులే హత్య చేసి తనపై నారాసుర రక్త చరిత్ర అని ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో భారీగా ఆస్తుల దోపిడీ జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ విధ్వంస పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు. రైతులకు కూడా చెప్పకుండా వారి భూముల్లో కాల్వలు తవ్వుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులను ప్రశ్నిస్తే అడ్డుకునే పరిస్థితి కనిపించడంలేదుని పేర్కొన్నారు. 

ఇసుక అక్రమాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో కేసులు వేసిన నాగేంద్రను వేధిస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రేపో, ఎల్లుండో తననూ అరెస్టు చేయవచ్చని లేదా దాడి చేస్తారని ఆరోపించారు. తాను నిప్పులా బతికానని, ఎప్పుడూ ఏ తప్పూ చేయలేదని చంద్రబాబు తెలిపారు. 

వైసీపీ చేసిన తప్పులన్నింటినీ మనపై మోపి కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అంటూ పార్టీ శ్రేణులకు తెలిపారు. 45 సంవత్సరాలుగా తనపై ఎవ్వరూ కేసులు పెట్టలేదని,  ఎక్కడా సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేశారు. తనపై దాడి చేసినా చేస్తారని పేర్కొంటూ అయితే తాను ఎవరికీ భయపడనని చంద్రబాబు చెప్పారు.

తనపై దాడి చేసి, రివర్స్‌లో కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అంగళ్లలో తనపై హత్యాప్రయత్నం చేసి తిరిగి తన మీదే 307 కేసు పెట్టారని తెలిపారు. తాను చెబితేనే దాడులు చేశారన్నట్లు స్టేట్మెంట్ రాయించేందుకు టీడీపీ కార్యకర్తలను ఒత్తడి చేస్తున్నారని ఆరోపించారు. యువగళం పాదయాత్రపై దాడులు చేసి, గాయపడిన వారిపైనే తిరిగి కేసులు పెడుతున్నారని తెలిపారు. వైసీపీ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. రివర్స్ టెండరింగ్ అని రివర్స్ పాలనకు తెరతీశారని చంద్రబాబు విరుచుకుపడ్డారు.