గోవింద నామాన్ని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం

యువ‌త‌లో హైంద‌వ స‌నాత‌న ధ‌ర్మ వ్యాప్తి కోసం శ్రీ‌వారి ఆల‌యం నుండే తొలి అడుగు వేస్తున్నామ‌ని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రామ‌కోటి త‌ర‌హాలో గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు వారికి వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఒక‌సారి తిరుమ‌ల స్వామివారి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు. 
 
10 ల‌క్ష‌ల 1,116 సార్లు గోవిందనామం రాసిన‌వారికి ద‌ర్శ‌న సౌభాగ్యం క‌ల్పిస్తామ‌ని చెప్పారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తొలి స‌మావేశం తీసుకున్న ముఖ్య నిర్ణ‌యాల‌ను ఛైర్మ‌న్ మీడియాకు తెలియ‌జేశారు.   స‌నాత‌న ధ‌ర్మం ప‌ట్ల‌, మాన‌వీయ, నైతిక విలువ‌ల ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఎల్‌కెజి నుండి పిజి వ‌ర‌కు చ‌దువుతున్న విద్యార్థుల‌కు సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా 20 పేజీల్లో భ‌గ‌వ‌ద్గీత సారాంశాన్ని పుస్త‌క ప్ర‌సాదంగా కోటి పుస్త‌కాలు ముద్రించి పంపిణీ చేస్తామ‌ని వెల్లడించారు.

అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, పెరటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది కావున భక్తులకు ఎలాంటి లేకుండా ఏర్పాట్లు చేసి బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేస్తామని చెప్పారు.

చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ ద్వారా గతంలో ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని నిర్ణయించారు.  ఈ ఏడాది జరిగే శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మరింత మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వహణకు గాను అదనంగా కార్మికులను ఏర్పాటు చేసుకునేందుకు రూ.32.73 లక్షలు మంజూరు చేశారు.

చంద్రగిరి శ్రీ మూలస్థాన యల్లమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రూ.2 కోట్లతో టెండరు ఆమోదించారు.  ముంబయిలోని బాంద్రాలో రూ.1.65 కోట్లతో శ్రీ వేంకటేశ్వరస్వామివారి రెండో ఆలయం, రూ.5.35 కోట్లతో సమాచార కేంద్రం నిర్మాణానికి పరిపాలన ఆమోదం తెలిపారు. ఈ మొత్తాన్ని టీటీడీ బోర్డు స‌భ్యులు విరాళంగా అందిస్తారు.

రూ.49.48 కోట్లతో టీటీడీ ఉద్యోగుల 1476 క్వార్టర్ల మరమ్మతులు చేపట్టేందుకు ఆమోదం తెలిపారు.  రూ.33 కోట్లతో వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన స్థలంలో రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు ఆమోదం తెలిపారు. ఈ మొత్తాన్ని ఉద్యోగులు తిరిగి టీటీడీకి చెల్లిస్తారు. రూ.600 కోట్లతో తిరుపతి రైల్వేస్టేషన్‌ వెనుక వైపు గల 2, 3 సత్రాల స్థానంలో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాల నిర్మాణానికి ఆమోదం తెలిపారు.