రూ. 400 కోట్లతో కనకదుర్గమ్మ, శ్రీశైలం దేవస్థానాల అభివృద్ధి

విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానాల అభివృద్ధి పనులను సుమారు రూ.400 కోట్లతో నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రూ.400 కోట్ల నిధులలో రూ.225 కోట్లను శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్దికి, రూ.175 కోట్లను శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్దికై వాస్తుపండితులు, స్తపతులు, పలువురు నిపుణులతో ఏర్పాటు చేసిన సాంకేతిక సలహా కమిటీ సూచనలతో మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించామని చెప్పారు. మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు టెండర్ల ఖరారు ప్రక్రియ కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెలలోనే ఆ మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారని పేర్కొన్నారు.

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ది పనులకు రూ.70 కోట్ల ప్రభుత్వ నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేసిన్నట్లు వెల్లడించారు. అదే విధంగా భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం అభివృద్ది పనులను రూ.175 కోట్లతో చేపట్టినట్లు మంత్రి తెలిపారు. 

రూ.75 కోట్లతో క్యూ కాంప్లెక్సు, రూ.40 కోట్లతో సాల మండపాల నిర్మాణం, మాడ వీధుల అభివృద్ది పనులు చేపడుతున్నామని వివరించారు. దాదాపు 4,600 ఎకరాల భూమిని ఆలయ పరిధిలోకి తీసుకు వచ్చామని, దాని ఫెన్సింగ్‌ కార్యక్రమాన్ని త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. 

సనాతన హిందూ ధర్మం ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేయాలనే లక్ష్యంతో ధర్మ ప్రచార పరిషత్‌ సనాతన హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 175 6(ఎ) దేవాలయాల్లో కూడా నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి కొట్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ మాసంలో ప్రారంభిస్తామని చెప్పారు.