న్యాయశాఖ అధికారులతో కోవింద్‌ భేటీ

జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై పరిశీలనకు ఏర్పాటు చేసిన ఎనమండుగురు సభ్యుల కమిటీ అప్పుడే తన పనిని ప్రారంభించింది. కేంద్ర న్యాయ శాఖలోని ఉన్నతాధికారులు ఆదివారం జమిలి కమిటీకి నేతృత్వం వహిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి పలు అంశాలను వివరించారు. జమిలి విషయంపై అధ్యయనం, నిర్వహణకు తగు సిఫార్సుల గురించి మాజీ రాష్ట్రపతికి విన్నవించినట్లు అత్యున్నత స్థాయి వర్గాల ద్వారా వెల్లడైంది.

న్యాయశాఖ కార్యదర్శి నితిన్ చంద్ర, లెజిస్లేటివ్ కార్యదర్శి రీటా వశిష్ట ఇతరులు మాజీ రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. కమిటి అజెండా రూపకల్పన గురించి మాజీ రాష్ట్రపతితో వీరు చర్చించినట్లు తెలిసింది. అంతకు ముందు జమిలి విషయంపై ప్రభుత్వ వైఖరిని కూడా వివరించారు. ఇప్పుడు మాజీ రాష్ట్రపతిని కలిసిన నితిన్ చంద్ర జమిలిపై ఏర్పాటు అయిన అత్యున్నత అష్ట సభ్య కమిటీలో కార్యదర్శిగా కూడా ఉన్నారు.

కాగా రీటా వశిష్ట ఎన్నికల నిర్వహణ, ప్రజా ప్రాతినిధ్య చట్టం, సంబంధిత లెజిస్లేటివ్ విషయాలను పర్యవేక్షిస్తున్నారు.  జమిలి కమిటీ సభ్యుల పేర్ల వెల్లడికి ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఓ తీర్మానం ఎందుకు వెలువరించాల్సి వచ్చిందనే ప్రశ్నకు అధికారులు స్పందించారు. తాము మంత్రిత్వ శాఖ ఆదేశాలను పాటిస్తున్నామని తెలిపారు.

ఇంతకు ముందు ఇందర్‌జిత్ గుప్తా కమిటీని కూడా ఇదే విధంగా ప్రకటించారని , దీనినే అనుసరించారని వివరించారు. ఈ కమిటీపై ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారని న్యాయశాఖ కార్యదర్శి నితిన్‌ చంద్ర, లెజిస్లేటివ్‌ కార్యదర్శి రీటా వశిష్ట పేర్కొన్నారు. జమిలి కమిటి సభ్యుల పేర్ల వెల్లడి దశలో వెలువరించిన తీర్మానంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏకకాల ఎన్నికల నిర్వహణ సముచితం అని తెలిపింది.

జాతీయ ప్రయోజనాల కోణంలో ఇది అత్యవసరం సముచితం అని పేర్కొంది. అసెంబ్లీలు, లోక్‌సభకు ఏక కాల ఎన్నికల వల్ల తరచూ ఎన్నికల నిర్వహణ వ్యయభారం తగ్గుతుంది. పైగా ప్రగతి పనులలో ఆటంకం ఏర్పడుతుందని, దీని నివారణకు జమిలి ఎన్నికలే సముచితం అని తెలియజేస్తూ సంబంధిత విషయాలను పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు, కమిటీలోని వారి పేర్లను వెల్లడించింది.

జమిలి ఎన్నికల నిర్వహణ కమిటీ ఏర్పాటు కీలకమైన విధాన నిర్ణయం కాబట్టి సంబంధిత విషయంపై ముందుగా నిర్ణయాన్ని అధికారికంగా వెలువరించడం, తర్వాత నోటిఫికేషన్ వెలువరించడం జరిగిందని అధికారులు తెలిపారు.