జీ-20 సదస్సుకు చైనా ప్రధాని లీ కియాంగ్

ఢిల్లీలో ఈ నెల 9, 10వ తేదీల్లో జరిగే జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ హాజరు కావడం లేదని చైనా ధ్రువీకరించింది. సదస్సుకు తమ ప్రధాని లీ కియాంగ్ హాజరవుతారని ప్రకటించింది. భారత్-చైనా మధ్య మూడేళ్లుగా సరిహద్దు విషయమై తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో భారత్ కు రాకూడదని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నిర్ణయించుకోవడం గమనార్హం.

‘‘భారత ప్రభుత్వం ఆహ్వానం మేరకు స్టేట్ కౌన్సిల్ ప్రధాని లీ కియాంగ్, ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరిగే 18వ జీ-20 సదస్సుకు హాజరుకానున్నారు’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ప్రకటన విడుదల చేశారు.  నిజానికి తమ అధ్యక్షుడు జీ-20 సదస్సుకు రావడం లేదని చైనా ఈ నెల 2నే సమాచారం ఇచ్చింది. ఇందుకు సంబంధించి లిఖిత పూర్వక సమాచారం ఇవ్వలేదు. తమ అధ్యక్షుడు ఎందుకు రావడం లేదన్న దానిపై చైనా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

ప్ర‌స్తుతం భార‌త్, చైనా మ‌ధ్య ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం ఉన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల చైనా విడుదల చేసిన కొత్త మ్యాప్ ప‌ట్ల భార‌త్ ఆందోళ‌న వ్యక్తం చేసింది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, అక్సాయ్ చిన్ ప్ర‌దేశాల‌ను త‌మ భూభాగంలో ఉన్న‌ట్లు చైనా త‌న మ్యాప్‌లో ప్ర‌చురించింది. దీన్ని భార‌త్ ఖండిస్తూ త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేసింది. 

ఈ నేప‌థ్యంలో రెండు దేశాల మ‌ధ్య మ‌ళ్లీ ప్ర‌చ్ఛ‌న్న వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. అందుకే జిన్‌పింగ్ జీ20 స‌మావేశాల కోసం ఇండియా రావ‌డం లేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. భారత్, చైనా మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ సమావేశానికి దూరంగా ఉండాలని జిన్ పింగ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

అయితే ఈ వార్తలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా స్పందించారు. జిన్ పింగ్ హాజరు కావడంలేదన్న వార్త తనను నిరాశకు గురిచేసిందని బైడెన్ చెప్పారు. చివరిసారిగా ఈ ఇద్దరు నేతలు బాలిలో నిర్వహించిన జీ20 సదస్సులో కలుసుకున్నారు.  ఆ తర్వాత చైనా నిఘా బెలూన్ ఒకటి అమెరికా గగనతలంపై ఎగరడం, యుద్ధ విమానాలను పంపించి అమెరికా దానిని కూల్చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఈ ఘటన తర్వాత ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడు బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లు కలుసుకోలేదు.