43 నగరాల్లో పెరిగిన ఇళ్ల ధరలు

దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 43 నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని నేషన్‌ హౌస్సింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ) తన మొదటి త్రైమాసిక నివేదికలో ప్రకటించిన హౌసింగ్ ప్రైస్‌ ఇండెక్స్‌లో తెలిపింది. గృహ రుణాల సంస్థల రెగ్యులరేటర్‌గా ఎన్‌హెచ్‌బీ పని చేస్తోంది. 

దేశంలో ఇంకా కరోనా ముందు నాటి కంటే వడ్డీ రేట్లు తక్కువగానే ఉన్నాయని, ఇవి భరించగలిగే స్థాయిలోనే ఉన్నాయని పేర్కొంది. హౌసింగ్‌లో 8 ముఖ్యమైన మార్కెట్లలో ఉన్న రేట్ల వివరాలను పేర్కొంది. 2023 ఏప్రిల్‌-జూన్‌ కాలంలో హైదరాబాద్‌లో 6.9 శాతం, అహ్మదాబాద్‌లో 9.1 శాతం, బెంగళూర్‌లో 8.9 శాతం, కోల్‌కతాలో 7.8 శాతం ఇళ్ల ధరలు పెరిగినట్లు తెలిపింది. 

వీటితో పాటు చెన్నయ్‌లో 1.1 శాతం, ఢిల్లిలో 0.8 శాతం, ముంబైలో 2.9 శాతం, పుణేలో 6.1 శాతం ధరలు పెరిగాయి. ఇవి వార్షిక ప్రాతిపదికన హౌస్సింగ్‌ ప్రైస్‌ ఇండెక్స్‌(హెచ్‌పీఐ) పెరిగినట్లు తెలిపింది. ఇళ్ల ధరలు నగరాల వారీగా చూస్తే కొన్ని చోట్ల భారీగా పెరిగితే, కొన్ని చోట్ల అదే స్థాయిలో తగ్గాయని పేర్కొంది. గురుగ్రామ్‌లో అత్యధికంగా 20.1 శాతం ధరలు పెరిగితే, లూథియానాలో 19.4 శాతం తగ్గాయి. 

ఒక త్రైమాసికం నుంచి మరో త్రైమాసికానికి చూస్తే 50-సిటీ ఇండెక్స్‌ ఏప్రిల్‌-జూన్‌ కాలంలో గత త్రైమాసికంలో 1.3 శాతం ఉంటే, ఈ త్రైమాసికంలో ఇది 0.7 శాతంగా ఉంది. 2021 నుంచి హౌసింగ్‌ ఇండెక్స్‌ను త్రైమాసికాల వారీగా కూడా లెక్కిస్తున్నారు. 50 సిటీ ఇండెక్స్‌లో 36 సిటీల్లో ఈ ఇండెక్స్‌ పెరిగింది. త్రైమాసికం వారిగా చూస్తే ఛండీఘర్‌లో అత్యధికంగా 4.9 శాతం ఇళ్ల ధరలు పెరిగాయి. 

నవీ ముంబై, లూథియానా, హౌరా, భివాండీ పట్ట ణాల్లో రికార్డ్‌ స్థాయిలో 2 శాతం ఈ ఇండక్స్‌ తగ్గింది. ఈ త్రైమాసికంలో అంచనా ధరలు నవీ ముంబైలో అత్యధికంగా 5.9 శాతం తగ్గాయి. మొత్తంగా 50 సిటీ ఇండెక్స్‌ పరంగా చూస్తే గత త్రైమాసికం కంటే 2.3 శాతం పెరుగుదల నమోదు చేసింది.