చంద్రుడిపై ఆక్సిజన్‌ ఆనవాళ్లు.. త్వరలో నివాసంకు ఆశలు

చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ పలు కీలక సమాచారాన్ని సేకరించింది. చంద్రుడిపై ఆక్సిజన్‌ ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించింది. అలాగే చంద్రుడిపై సల్ఫర్‌ నిక్షేపాలు కూడా భారీగానే ఉన్నాయని తొలిసారిగా కనుగొన్నది. ఆక్సిజన్‌, సల్ఫర్‌ మాత్రమే కాకుండా పలు ఖనిజాలు ఉన్నట్లుగా ప్రజ్ఞాన్‌ రోవర్‌ గుర్తించింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ట్విట్టర్‌ వేదికగా వెల్లడించింది. 
 
అందులోని లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (ఎల్‌ఐబిఎస్) పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలం వద్ద సల్ఫ ర్ (ఎస్) ఉనికిని స్పష్టంగా గుర్తించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీనితో పాటుగా అల్యూమినియం(ఎఎల్), కాల్షి యం (సిఎ), ఫెర్రమ్ (ఎఫ్‌ఇ), క్రోమియం (సిఆర్), టైటానియం (టిఐ), సిలికాన్ (ఎస్‌ఐ) మ్యాంగనీస్ (ఎంఎన్), ఆక్సిజన్ (ఒ) మూలకాలను కూడా ఈ పరికరం గుర్తించినట్లు ఇస్రో  తెలియజేసింది.
 
‘‘ప్రస్తుతం చంద్రుడిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. రోవర్‌లోని లిబ్స్‌ దక్షిణ ధ్రువానికి సమీపంలో జాబిల్లి ఉపరితలంపై సల్ఫర్‌ (ఎస్‌) ఉనికిని స్పష్టంగా గుర్తించింది. ఊహించినట్టుగానే అల్యూమినియం, కాల్షి యం, ఫెర్రస్‌, క్రోమియం, టైటానియం, మాంగనీస్‌, సిలికాన్‌, ఆక్సిజన్‌లను కూడా గుర్తించింది. హైడ్రోజన్‌ (హెచ్‌)కోసం అన్వేషణ కొనసాగుతోంది’ అని ఇస్రో ట్విటర్‌ (ఎక్స్‌)లో పోస్ట్‌ చేసింది.
చంద్రయాన్‌-3 ద్వారా చంద్రుడిపై మనిషి నివసించటానికి అవసరమైన అన్ని మూలకాలు, పరిస్థితులను ఇస్రో గుర్తించినట్టయ్యింది. దీంతో ఖగోళ శాస్త్రవేత్తలు ఆశ్చర్యచకితులవుతున్నారు. భవిష్యత్తులో సుదూర ఖగోళ యాత్రల కోసం చంద్రుడిని ఒక మజిలీగా వాడుకోవాలని చాలాదేశాలు ఇప్పటికే ప్రయోగాలు మొదలుపెట్టాయి. ఇప్పుడు ప్రజ్ఞాన్‌ గుర్తించిన మూలకాల్లో ఆక్సిజన్‌ కూడా ఉండటం, ఉపరితలానికి అడుగు లోపలే చల్లని వాతావరణం ఉండటంతో శాస్త్రవేత్తలకు కొత్త ఆశలు చిగురించాయి.
 
హైడ్రోజన్ కోసం అన్వేషణ కొనసాగుతోందని కూడా ఇస్రో తెలిపింది.  దీనికి సంబంధించిన ఒక గ్రాఫ్‌ను కూడా ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. ఈగ్రాఫ్‌లో చంద్రుడి ఉపరితలంపై వివిధ లోతులలో గల ఉష్ణోగ్రతల్లో ఉన్న వైవిధ్యాన్ని ఇస్రో వివరించింది. ఆ గ్రాఫ్ ప్రకారం లోతు పెరిగిన కొద్దీ చంద్రుడి ఉష్ణోగ్రత తగ్గుతుంది. 
 
చందమామపై మట్టి, ఖనిజాలను పరిశోధించడం కోసం ఈ ఎల్‌ఐబిఎస్ పరికరాన్ని పంపించారు. ఈ పరికరాన్ని బెంగళూరులోని ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ (ఎల్‌ఇఓఎస్) ప్రయోగ శాలలో అభివృద్ధి చేసినట్లు ఇస్రో తెలిపింది. మరో వైపు చంద్రుడి ఉపరితలంపై రోవర్ అన్వేషణకు మరో ఏడు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో రోవర్‌ను వీలయినంత ఎక్కువగా చంద్రుడి ఉపరితలంపై తిప్పడానికి ఇస్రో శాస్త్రజ్ఞులు కాలంతో పోటీ పడి కృషి చేస్తున్నారు.
 
14 రోజుల తర్వాత చంద్రుడిపై రాత్రి మొదలవుతుంది. ఆ సమయంలో చంద్రుడిపై ఉష్ణోగ్రతలు మైనస్ 180 నుంచి 250 డిగ్రీలకు పడిపోతుంది. ఆ సమయంలో సైరశక్తితో పని చేసే రోవర్‌లోని పరికరాలు చాలావరకు సుషుప్తావస్థలోకి వెళ్లిపోతాయి. దీంతో ఈ లోగానే రోవర్ కీలకమైన ప్రయోగాలు జ రిపేలా చూడాలని శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు. 
 
శివశక్తి ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని రోవర్ అన్వేషిస్తూనే ఉంటుందని, రోవర్ ఇప్పటివరకు సుమారు 8 మీటర్ల ప్రాంతాన్ని కవర్ చేసిందని ఇస్రో అంచనా వేసింది. కాగా చంద్రుడి దూళి, కంకర వంటి రసాయన కూర్పును పరిశోధించడం రోవర్ ప్రధాన లక్షాల్లో ఒకటి.
ఈ పరిశోధన చంద్రుని భూగర్భ శాస్త్రం, వాతావరణం గురించి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది మనం చంద్రుడి గురించి ఒక అవగాహనకు రావడానికి దోహదం చేస్తుంది.
 
ఇలా ఉండగా, ఆకాశంలో అద్భుతం జరగనుంది. బుధవారం రాత్రి చందమామ భూమికి మరింత దగ్గరగా రానుంది. సాధారణ పౌర్ణమి కంటే మరింత పెద్దదిగా,  ప్రకాశవంతంగా కనువిందు చేయనుంది. అందుకే దీన్ని సూపర్‌ బ్లూ మూన్‌ అంటారు. అంటే ఇది నీలం రంగులో ఉండదు. ఒక నెలలో రెండోసారి పౌర్ణమి వచ్చింది కాబట్టి దాన్ని బ్లూ మూన్‌ అని పిలుస్తారు.