సెప్టెంబర్ 19 నుంచి జియో ఎయిర్ ఫైబర్‌

* రిల‌య‌న్స్ బోర్డు నుంచి త‌ప్పుకున్న నీతా అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ కంపెనీ బోర్డు నుండి తప్పుకున్నారు. ఇప్పటి వరకు ఆమె బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే వారి పిల్లలు ఇషా, ఆకాశ్, అనంత్ అంబానీలు బోర్డులోకి వస్తుండటంతో ఆమె తప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. సంస్థ‌లో ఈ ముగ్గుర్నీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్లుగా నియ‌మించ‌నున్నారు. 

46వ వార్షిక సాధారణ స‌మావేశాల సంద‌ర్భంగా ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ ఈ నియామ‌కంపై నిర్ణ‌యం తీసుకోవాల‌ని బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్లను కోరారు. షేర్ హోల్డ‌ర్ల నుంచి ఈ అంశం పెండింగ్‌లో ఉంది. కొన్నేళ్లుగా వీరు ముగ్గురు వ్యాపారాలను చూసుకుంటున్నారు.  రిటైల్, డిజిట‌ల్ స‌ర్వీసులు, ఎన‌ర్జీ రంగాల‌కు చెంద‌ని వ్యాపారాన్ని చూసుకుంటున్నారు. రిల‌య‌న్స్ అనుబంధ‌ కంపెనీల బోర్డుల్లోనూ వీరు ఉన్నారు.

ఇప్పుడు వీరు బోర్డులోకి వస్తున్న నేపథ్యంలో నీతా రాజీనామాను డైరెక్ట‌ర్లు అంగీక‌రించారు. అయితే అన్ని బోర్డు మీటింగ్‌ల‌కు ఆమె ఓ శాశ్వత ఆహ్వానితురాలిగా హాజరవుతారు. ఇలా ఉండగా, వైఫై వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో ఎయిర్ ఫైబర్‌  ప్రారంభ తేదీని ఏజీఎమ్ 2023 వార్షిక సమావేశాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 19 నుంచి జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.

గ‌ణేశ్ చుతుర్ధి సంద‌ర్భంగా ఎయిర్ ఫైబ‌ర్‌ను ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ ద్వారా రోజు 15వేల క‌నెక్ష‌న్లు ఇవ్వ‌గ‌ల‌మ‌ని, కానీ జియో ఫైబ‌ర్ ద్వారా ఈ క‌నెక్ష‌న్ల సంఖ్య‌ను ల‌క్షా 50 వేల‌కు పెంచ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 5జీ టెక్నాల‌జీ ద్వారా అత్యంత వేగంగా డేటాను జియో ఎయిర్ ఫైబ‌ర్ అందిస్తుంది.

గ‌డిచిన ప‌దేళ్ల‌లో రిల‌య‌న్స్ సంస్థ 150 బిలియ‌న్ల డాల‌ర్లు పెట్టుబ‌డి పెట్టింద‌ని చెప్పారు. కొత్త ఇండియా పూర్తి ఆత్మ‌స్థ‌యిర్యంతో ఉంద‌ని, ఈ ఇండియాను ఎవ‌రూ ఆప‌లేర‌ని, ఓ లీడింగ్ దేశంగా ఇండియా ఎదుగుతుంద‌ని, జీ20 స‌మావేశాల‌కు ఇండియా వేదిక కావ‌డం చ‌రిత్రాత్మ‌కం అని ఆయ‌న పేర్కొన్నారు. గ‌త అక్టోబ‌ర్‌లో 5జీ సేవ‌ల్ని స్టార్ట్ చేశామ‌ని, ఇప్పుడు ఆ సేవ‌లు 96 శాతం ప‌ట్ట‌ణాల్లో అందుబాటులో ఉంద‌ని, ఈ ఏడాది డిసెంబ‌ర్‌లోగా ఆ సేవ‌ల్ని యావ‌త్ దేశానికి అందేలా చూస్తామ‌ని రిల‌య‌న్స్ అధినేత వెల్లడించారు.

రిల‌య‌న్స్ ఎగుమ‌తులు ఈ ఏడాది 33.4 శాతం పెరిగాయ‌ని, అది రూ. 3.4 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. జియో నెట్వ‌ర్క్ ద్వారా ప్ర‌తి నెల‌కు దేశ‌వ్యాప్తంగా 1100 కోట్ల జీబీ డేటాను వాడుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మరోవంక, రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ‘జియో ఫైనాన్సియల్ సర్వీసెస్’ బీమా రంగంలోకి అడుగు పెట్టనున్నదని ముకేశ్ అంబానీ వెల్లడించారు.  సాధారణ, జీవిత, ఆరోగ్య బీమా రంగ ఉత్పత్తుల్లోకి ప్రవేశిస్తుంది చెబుతూ ఇందుకోసం గ్లోబల్ ఇన్సూరెన్స్ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంటుందని తెలిపారు.

‘ప్రారంభంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ ఏర్పాటు చేయాడానికి జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్)లో రిలయన్స్ రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇది పూర్తిగా అత్యధిక పెట్టుబడుల ఇన్సెంటివ్ బిజినెస్.’ అని ముకేశ్ అంబానీ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ- అమెరికా కేంద్రంగా పని చేస్తున్న బ్లాక్ రాక్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తుందని  చెప్పారు.