హిజాబ్ ధరించని మహిళలకు ఆఫ్ఘన్ పార్క్ లలో నిషేధం

రెండు దశాబ్దాల పాటు అమెరికా, నాటో బలగాల నీడలో స్వేచ్ఛగా విహరించిన అఫ్గనిస్థాన్ ప్రజలు ముఖ్యంగా మహిళలు ప్రస్తుతం దుర్బర జీవితాన్ని గడుపుతున్నారు. సరిగ్గా రెండేళ్ల కిందట అమెరికా సేనలు అఫ్గన్ నుంచి వైదొలగడంతో అక్కడ తాలిబన్ల ఆటవిక పాలన మళ్లీ మొదలైంది.  ఎటువంటి ఆంక్షలు విధించబోమని, ప్రతీకార చర్యలు కూడా ఉండబోవని అధికారం చేపట్టిన తొలినాళ్లలో తాలిబన్లు చేసిన ప్రకటనలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి.
గతంలో మాదిరిగానే కఠిన ఆంక్షలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మహిళల విషయంలో మరింత కర్కశకంగా వ్యవహరిస్తున్నారు. మహిళలను ఉపాధి, ఉద్యోగాలకు దూరం చేసేలా వారికి మాధ్యమిక విద్య, యూనివర్శిటీల్లో ప్రవేశాలపై నిషేధం విధిస్తూ హుకుం జారీ చేశారు. ఆ తర్వాత దూర ప్రయాణాలు, బ్యూటీ పార్లర్లకు వెళ్లడాన్ని కూడా నిషేధించారు. తాజాగా, హిజాబ్‌ ధరించని మహిళలను జాతీయ పార్కుల్లోకి అనుమతించబోమని ప్రకటించారు. 
 
బమియాన్‌లోని అఫ్గన్ తొలి జాతీయ పార్కు బంద్‌-ఈ-అమిర్‌ సహా దేశంలోని ఇతర పార్కుల్లోకి అనుమతించరాదని పేర్కొంటూ తాలిబన్‌ వైస్‌ అండ్‌ వర్చ్యూ మినిస్ట్రీ (ఇస్లామిక్‌ చట్టాల అమలు శాఖ) మంత్రి మహ్మద్‌ ఖలీద్‌ హనాఫీ సిబ్బందికి సూచించారు. మహిళలు పార్కులు, విహార స్థలాలు సందర్శించడం తప్పనిసరి కాదని, హిజాబ్‌ ధరించని వారిని జాతీయ పార్కుల్లోకి అనుమతించవద్దని ఆ ఉత్తర్వుల్లో సూచించారు. అవసరమైతే వారిని అడ్డుకోడానికి బలప్రయోగానికి కూడా వెనుకాడవద్దని ఆదేశించినట్లు తాలిబన్‌ అధికార ప్రతినిధి మహ్మద్‌ సాధిఖ్‌ అఖిఫ్‌ వెల్లడించారు. 
 
ఇంటి నుంచి బయటికి వచ్చేప్పుడు మహిళలు ఇస్లామిక్‌ నిబంధనలను సక్రంగా అనుసరించడం లేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.  బమియాన్ షియా ఉలేమా కౌన్సిల్ చీఫ్ సయ్యర్ నసీరుల్లాహ్ వయజీ మాట్లాడుతూ.. ‘బమియాన్ స్థానికులు తప్ప హిజాబ్ లేకుండా లేదా సరిగ్గా ధరించకుండా ఇతర ప్రాంతాలకు చెందిన చాలా మంది జాతీయ పార్కుకు వస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి.’ అని పేర్కొన్నారు. 
 
అఫ్గన్‌లో మొదటి జాతీయ పార్కు బమియన్. దీనిని 2009లో ఏర్పాటు చేశారు. ఇది ప్రముఖ పర్యాటక స్థలంగా గుర్తింపు పొందింది. యునెస్కో సైతం ‘ప్రత్యేక భౌగోళిక నిర్మాణాలు.. అలాగే ప్రత్యేకమైన అందంతో సహజంగా ఏర్పడిన సరస్సుల సమూహంగా’ అభివర్ణించింది. తాలిబన్ల తాజా ఆదేశాలపై ఆఫ్గన్ మహిళల హక్కుల కోసం పోరాడుతున్న హ్యుమన్ రైట్ వాచ్‌ ప్రతినిధి హీథర్‌ బార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.
‘తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత మహిళలకు విద్య, ఉద్యోగం, క్రీడలు నుంచి దూరం చేశారు.. ఇప్పుడు ప్రకృతి, పార్కుల నుంచి వారిని దూరం చేయాలని భావిస్తున్నారు. ఇది ప్రణాళికా బద్ధంగా మహిళల స్వేచ్ఛను హరించడమే’ అని హీథర్‌ ఆరోపించారు.  ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ గోడలను మూసివేసి, ప్రతి ఇంటిని ఓ జైలుగా మార్చేస్తున్నారని దుయ్యబట్టారు.  అంతర్జాతీయంగా తాలిబన్లు ఆంక్షలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కానీ, తాలిబన్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ స్వేచ్ఛ కోసం మహిళలు చేస్తోన్న ఆందోళనలు, నిరసనలను ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు.  అఫ్గనిస్థాన్‌లో మానవ హక్కుల పరిస్థితిపై ఐరాస ప్రత్యేక ప్రతినిధి ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘షరియా, అఫ్గన్ సంస్కృతికి అనుగుణంగా బంద్-ఎ-అమీర్‌ను సందర్శించే మహిళలపై ఈ ఆంక్షలు ఎందుకు అవసరమో ఎవరైనా దయచేసి వివరించగలరా?’ అని ప్రశ్నించారు.