వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 200 తగ్గింపు

వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 200 తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వంట గ్యాస్ ధరలను తగ్గిస్తామని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాగ్దానాన్ని తిప్పికొట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఉజ్వల వినియోగదారులకు గ్యాస్ ధర రూ.400 తగ్గించింది. రక్షా బంధన్ సందర్భంగా మహిళలలకు ప్రధాని మోదీ కానుకగా ఇచ్చారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత తెలిపారు.  గృహ వినియోగదారులకు ఊరట కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2014లో ప్రధాని మోదీ నేతృత్వంలో తాము అధికారంలోకి వచ్చినప్పుుడ దేశవ్యాప్తంగా 14.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్స్ ఉండేవని, ఇప్పుడు అవి 33 కోట్లకు చేరాయని తెలిపారు. వాటిలో 9.6 కోట్ల కనెక్షన్లు ఉజ్వల యోజన పథకంలోనివని పేర్కొన్నారు.

మొత్తం మీద, 33 కోట్ల గ్యాస్ వినియోగదారులకు లబ్ది చేకూరనుందని వెల్లడించారు. అంతేగాక ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను మరో 75 లక్షలు అందచేస్తామని, దీంతో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం 14.2 కేజీల ఎల్‌పిజి సిలిండర్ ధర న్యూఢిల్లీలో రూ.1103 ఉంది. బుధవారం నుంచి ఇది రూ. 903 ఉండనున్నది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు ఎల్‌పిజి సిలిండర్ రూ. 703కు అందుబాటులోకి వస్తుంది.