మంత్రి రోజా భర్తపై అరెస్ట్‌ వారెంట్‌

ఏపీ పర్యాటకశాఖ మంత్రి, సినీ నటి రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్‌ వారెంజ్‌ జారీ అయ్యింది. పరువు నష్టం దావా కేసులో చెన్నై కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2016లో ఓ తమిళ ఛానెల్‌కి సెల్వమణి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో తనను కించపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేశారని ఓ సినీ ఫైనాన్షియర్‌ ఆరోపించారు. 
 
ప్రస్తుతం జార్జి టౌన్ కోర్టులో కేసు విచారణ నడుస్తోంది. విచారణ సమయంలో దర్శకుడు సెల్వమణి విచారణకు హాజరుకావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. ఆయన న్యాయవాది కూడా హాజరు కాలేదు. దాంతో కోర్టు తాజా అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.   ఇది నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ కావడంతో సెల్వమణి ఇప్పుడు అరెస్టు వారెంట్ నుంచి తప్పించుకోవాలంటే కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. 
అయితే, ఆయన కోర్టుకు హాజరవుతారా? లేదా న్యాయవాది ద్వారా కోర్టును ఆశ్రయిస్తారా? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.  వివరాల్లోకి వెళితే ఓ కేసులో ముకుంద్‌చంద్‌ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్‌ 2016లో అరెస్టయ్యారు.  ఆ సమయంలో దర్శకుడు ఆర్కే సెల్వమణి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అరుణ్ అన్నరసుతో కలిసి ఒక టీవీ ఛానెల్‌‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
అందులో తన పరువు ప్రతిష్టలను కించపరిచేలా సెల్వమణి వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ  బోత్రా జార్జిటౌన్ కోర్టులో దావా వేశారు. ఈ వ్యాఖ్యలతో తన పరువుకు నష్టం వాటిల్లిందని పిటిషన్‌లో ఆరోపించారు. కొద్ది రోజులకు బోద్రా మరణించగా ఆయన తనయుడు గగన్‌ కోర్టులో కేసును కొనసాగిస్తున్నారు. 2016 నుంచి కేసు కొనసాగుతున్నది.