ఏపీలో పాఠ‌శాల‌లో సెల్ పోన్లు నిషేధం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్లపై నిషేధం విధించింది. పాఠశాలలకు విద్యార్థులు ఫోన్లను తీసుకురాకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులు సైతం తమ ఫోన్లను తరగతి గదుల్లోకి తీసుకురాకూడదని ఆదేశించింది. తరగతి గదులకు వెళ్లే ముందు ఉపాధ్యాయులు తన ఫోన్లను ప్రధానోపాధ్యాయుడికి అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
బోధనకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించే ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా ప్రధానోపాధ్యాయులు, ఉన్నతాధికారులు చూడాలని ఆదేశించింది.
 
యూనెస్కో విడుదల చేసిన గ్లోబల్‌ ఎడ్యుకేషన్ మానిటరింగ్ నివేదిక ఆధారంగా పాఠశాలల్లో విద్యార్థుల బోధనకు ఎలాంటి ఆటంకం కలకకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల దిల్లీ సర్కార్ కూడా స్కూళ్లలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది. 
 
తరగతి గదులు, లైబ్రరీలు, ప్లే గ్రౌండ్స్‌తో పాటు పాఠశాల పరిధిలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు కూడా మొబైల్ ఫోన్లు వాడరాదని దిల్లీ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు, విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.