‘గగన్‌యాన్’కు మహిళా రోబో

భారత దేశం గగన్‌యాన్ మిషన్ లో మహిళా రోబో వ్యోమమిత్రను అంతరిక్షానికి పంపిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రయోగాత్మక పరీక్షలు అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో జరుగుతాయని తెలిపారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన జీ20 కాంక్లేవ్‌లో శనివారం ఆయన ఈ వివరాలను తెలిపారు.

కరోనా మహమ్మారి వల్ల గగన్‌యాన్ కార్యక్రమం ఆలస్యమైందని ఆయన చెప్పారు. మొదటి ట్రయల్ మిషన్‌ను అక్టోబరు మొదటి లేదా రెండో వారంలో నిర్వహించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపారు. వ్యోమగాములను పంపించడం ఎంత ముఖ్యమో, వారిని తిరిగి తీసుకురావడం కూడా అంతే ముఖ్యమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

రోబోను పంపిన తర్వాత అంతా సవ్యంగా ఉంటే ఇక వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించవచ్చని ఆయన తెలిపారు. భూమి పైనుంచి 400 మీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి గగన్‌యాన్‌ మిషన్‌ ద్వారా వ్యోమగాములను తీసుకెళ్లనున్నారని చెప్పారు. మహిళా రోబో అన్ని మానవ కార్యకలాపాలను నిర్వహిస్తుందని పేర్కొంటూ అంతా సవ్యంగా జరిగితే, మరింత ముందుకు వెళ్లవచ్చునని చెప్పారు. చంద్రుని దక్షిణ ధ్రువంపైన చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టడంతో తాము గొప్ప ఊరట పొందామని ఆయన చెప్పారు. 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) టీమ్‌తో అనుబంధంగా ఉన్నవారంతా చాలా ఉద్విగ్నంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్-3 భూ కక్ష్య నుంచి విడిపోయి, చంద్రుని కక్ష్యలోకి చేరినపుడు తాను చాలా ఉద్విగ్నభరితుడినయ్యానని చెప్పారు. విక్రమ్ ల్యాండర్ చాలా సున్నితంగా చంద్రునిపైకి దిగిందని గుర్తు చేశారు.

 చంద్రయాన్-3 విజయవంతమవడంతో ఇస్రో, భారతదేశంలో అంతరిక్ష పరిశోధన రంగంలో గొప్ప ముందుగు వేశాయని జితేందర్ సింగ్ చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. 2019 వరకు శ్రీహరి కోట తలుపులు మూసి ఉండేవని, కానీ ఈసారి మీడియా, విద్యార్థినీ, విద్యార్థులను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈసారి ఇది ప్రజల సొంతం అయిందని చెబుతూ అంతరిక్ష పరిశోధనల కోసం నిధులను పెంచినట్లు తెలిపారు.