రష్యా తిరుగుబాటు నేత ప్రిగోజిన్‌ దుర్మరణం

రష్యాపై ఇటీవల తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ చీఫ్‌ ప్రిగోజిన్‌ విమాన ప్రమాదంలో మరణించినట్టు రష్యాకు చెందిన టాస్‌ న్యూస్‌ ఏజన్సీ పేర్కొన్నది. మాస్కో నుంచి సెయింట్‌ పీట్స్‌బర్గ్‌ వెళుతున్న ఒక ప్రైవేట్‌ విమానం బుధవారం మాస్కో ఉత్తర ప్రాంతంలోని ట్విర్‌ రీజియన్‌లో కూలిపోయింది. ప్రమాదంలో 10 మంది మరణించారు.
 
దేశ రాజధాని మాస్కో నుంచి సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ ప్రయాణిస్తున్న ప్రైవేట్‌ ఎంబ్రేయర్‌ లెగసీ విమానం ట్వెర్‌ ప్రాంతంలోని కుజెంకినో అనే గ్రామ సమీపంలో కూలిపోయినట్లు రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 30 నిమిషాల కంటే తక్కువ సమయం పాటు గాలిలో ఉండటంతో విమానం నేలపైకి మంటలు చెలరేగినట్లు ప్రభుత్వ మీడియా పేర్కొన్నప్పటికీ, వాగ్నర్-లింక్డ్ టెలిగ్రామ్ ఛానెల్ గ్రే జోన్ జెట్‌ను రష్యా సైన్యం కాల్చివేసిందని పేర్కొంది.
 
కాగా, ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ప్రిగోజిన్ తిరుగుబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఓవైపు, ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక చర్య కొనసాగుతుండగా మరోవైపు వాగ్నర్ అధినేత ప్రిగోజిన్ సుదీర్ఘకాలంగా బంధం ఏర్పర్చుకున్న పుతిన్ పై తిరుగుబావుటా ఎగురవేశారు.  పుతిన్ నిర్ణయాలను వ్యతిరేకించిన ప్రిగోజిన్, పుతిన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించారు. అయితే, చర్చల ద్వారా ప్రిగోజిన్ వెనక్కి తగ్గారు. 
ప్రిగోజిన్‌ మరణమే కనుక నిజమైతే అది ప్రమాదం కాకపోవచ్చునని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రష్యన్ స్టేట్ ఏవియేషన్ అథారిటీ రోసావియేషన్ కూడా ఈ సంఘటనపై దర్యాప్తును ప్రకటించింది, “ఆగస్టు 23న ట్వెర్ ప్రాంతంలో జరిగిన ఎంబ్రేయర్-135 విమానంతో ప్రమాదం యొక్క పరిస్థితులు, కారణాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిషన్ దర్యాప్తు ప్రారంభించింది” అని పేర్కొంది.
ఇదిలా ఉండగా రెండో ప్రపంచ యుద్ధంలోని కుర్సుకు పోరుకు 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం జాతినుద్దేశించి ప్రసంగించిన పుతిన్.. ఈ విమాన ప్రమాదం గురించి కనీసం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ‘ఏమి జరిగిందో నాకు ఖచ్చితంగా తెలియదు.. కానీ నేను ఆశ్చర్యపోలేదు’ బైడెన్ వ్యాఖ్యానించారు. ‘రష్యాలో జరిగే చాలా వాటి వెనుక పుతిన్ ఉన్నాడని కాదు.. కానీ ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను’ అని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడి సన్నిహితుడు మైఖైలో పోడోల్యాక్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ‘2024 ఎన్నికలకు ముందు రష్యాలోని ప్రముఖులకు పుతిన్ నుంచి ఒక సంకేతం. ‘జాగ్రత్త! నమ్మకద్రోహం మరణంతో సమానం’ అని విమర్శించారు. బెలారస్ ప్రతిపక్ష బహిష్కృత నాయకురాలు స్వెత్లానా టిఖానోవ్స్కాయా ‘రష్యాలో స్వల్పకాలిక తిరుగుబాటు తర్వాత కొంతమంది వాగ్నర్ యోధులు తరలివెళ్లారు.. ప్రిగోజిన్ మా దేశంలో ఉన్నాడు.. ఏదిఏమైనా అతడో హంతకుడు.. అలానే గుర్తుంచుకోవాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రలో వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత ప్రిగోజిన్‌ మాస్కో తరఫున క్రియాశీలంగా పోరాడారు. పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉంది. 1981లో దొంగతనం, దోపిడీ కేసుల్లో 12 ఏళ్ల జైలు శిక్ష అనుభవించినన ప్రిగోజిన్.. విడుదలైన తర్వాత రకరకాల వ్యాపారాలు చేశారు. సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో పలు రెస్టారెంట్లను నెలకొల్పాడు. అప్పుడే పుతిన్‌తో ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. క్రమంగా అతడు పుతిన్ ఆంతరంగికుల్లో ఒకడిగా ఎదిగారు.

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ డిప్యూటీ మేయర్‌గానూ పని చేసి.. రష్యా ప్రభుత్వ ఆహార కాంట్రాక్టులన్నీ దక్కించుకున్నాడు. అంచెలంచెలుగా పుతిన్ అండతో ఆర్థికంగా ఎదిగి వాగ్నర్‌ ముఠాకు నాయకుడు అయ్యారు. ఈ గ్రూపు ఆఫ్రికాలోని మాలి తదితర చోట్ల పనిచేస్తోంది. వాగ్నర్‌ సైన్యం 90 శాతం మంది ఖైదీలే అని అమెరికా ఓ నివేదికలో పేర్కొంది. హత్య, ఇతర క్రూర నేరాలు చేసిన వ్యక్తులను వాగ్నర్‌ ముఠా చేర్చుకుంటుంది. ప్రిగోజిన్‌ అగ్రరాజ్యాల వాంటెడ్‌ జాబితాలో ఉన్నాడు.