
లక్షద్వీప్ లోక్ సభ సభ్యుడు, ఎన్‌సీపీ నేత మహమ్మద్ ఫైజల్ కు సుప్రీంకోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. హత్యాయత్నం కేసులో ఆయన దోషి అని క్రింది కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం రద్దు చేసింది. ఈ కేసుపై తాజాగా ఆరు వారాల్లోగా విచారణ జరిపి, తీర్పు చెప్పాలని హైకోర్టును ఆదేశించింది.
అయితే ఫైజల్‌ను లోక్ సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించకుండా ఆయనకు ఆరు వారాల వరకు ఉపశమనం కల్పించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం ఈ తీర్పు చెప్పింది. 2009 లోక్ సభ ఎన్నికల సమయంలో దివంగత కేంద్ర మంత్రి పీఎం సయీద్ అల్లుడు మహమ్మద్ సలీహ్‌ను హత్య చేసేందుకు ఫైజల్ ప్రయత్నించినట్లు కేసు నమోదైంది.
ఈ కేసుపై లక్షద్వీప్‌లోని కవరత్తి సెషన్స్ కోర్టు విచారణ జరిపి, ఆయనతో సహా మరో ముగ్గురిని దోషులుగా 2023 జనవరి 11న తీర్పు చెప్పింది. వీరికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ, ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున జరిమానా కూడా విధించింది. ఫైజల్ ఈ తీర్పును కేరళ హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు జనవరి 25న తీర్పు చెప్తూ, సెషన్స్ కోర్టు తీర్పుపై అపీలుపై విచారణ పూర్తయ్యే వరకు ఆ తీర్పును, శిక్షను సస్పెండ్ చేసింది.
ఈ తీర్పును సస్పెండ్ చేయకపోతే, ఫైజల్‌పై లోక్ సభ సభ్యత్వానికి అనర్హత వేటు పడుతుందని, ఫలితంగా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని, ప్రజలపైనా, ప్రభుత్వంపైనా ఆర్థిక భారం పడుతుందని తెలిపింది. ఈ తీర్పు తప్పు అని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పును లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు జనవరి 30న అంగీకరించింది. తాజా తీర్పుతో లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ దాఖలు చేసిన అపీలుపై ఆరు వారాల్లోగా విచారణ జరిపి, తీర్పు చెప్పవలసి ఉంటుంది.
More Stories
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం
ఆర్మీ హిట్ లిస్ట్ లో 14 మంది ఉగ్రవాదులు!
విద్యార్థి వీసాపై పాక్ కు వెళ్లి శిక్షణ తీసుకున్న ఆదిల్ థోకర్!