జైలులో స‌రెండ‌ర్ కానున్న డోనాల్డ్ ట్రంప్

అమెరికా మాజీ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ జార్జియా రాష్ట్రంలోని ఫుల్ట‌న్ కౌంటీ జైలులో స‌రెండ‌ర్ కానున్నారు. గురువారం రోజున ఆయ‌న లొంగిపోనున్న‌ట్లు తెలుస్తోంది. 2020 దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో జార్జియా రాష్ట్ర ఫ‌లితాల‌ను మార్చేందుకు ట్రంప్ ప్ర‌య‌త్నించిన‌ట్లు ఓ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.  ఆ కేసులో ట్రంప్‌తో పాటు మ‌రో 18 మంది ఆగ‌స్టు 25వ తేదీలోపు లొంగిపోవాల‌ని గ‌తంలో జ‌డ్జి ఆదేశించారు.
స్వ‌చ్ఛంధంగా ట్రంప్‌తో పాటు మ‌రో 18 మంది కూడా స‌రెండ‌ర్ అయ్యేందుకు ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. జైలులో స‌రెండ‌ర్ అయ్యే అంశాన్ని ట్రంప్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో వెల్ల‌డించారు.  “మీరు నమ్మలేకపోవచ్చు. ఈ గురువారం అట్లాంటా వెళ్తున్నా. నన్ను అరెస్టు చేస్తారు. ఆ విషయం నాకు తెలుసు. అంతా బైడెన్ చేతుల్లోనే ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.  ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ట్రంప్​నకు ఎన్నికల ముందు అరెస్ట్​ భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది.
 
గురువారం జార్జియా వెళ్లనున్న తనను అక్కడ రాడికల్‌ వామపక్ష డిస్ట్రిక్ట్‌ అటార్నీ ఫాని విల్లీస్‌ అరెస్టు చేసే ప్రమాదం ఉందని ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్నంతా బైడెన్‌ ఆధీనంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ సమన్వయం చేస్తోందని ఆరోపించారు. ఫాని విల్లీస్‌ దీనిని ప్రచారం చేసుకుని.. డబ్బు పోగుచేస్తున్నారని ఆరోపణలు చేశారు.
 
మ‌రోవైపు జైలు అధికారుల‌తో ట్రంప్ లాయ‌ర్లు చ‌ర్చ‌లు జ‌రిపారు. సుమారు రెండు ల‌క్ష‌ల డాల‌ర్ల బెయిల్‌పై ఆయ‌న్ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎన్నిక‌ల్లో ఓట‌మిని త‌ట్టుకోలేని ట్రంప్‌ ఆ ఫ‌లితాల‌ను మార్చేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు ఆయ‌న‌పై నేరాభియోగాలు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. 
 
రాబోయే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న ట్రంప్‌ ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు క్రిమిన‌ల్ కేసుల‌తో లింకు ఉన్న 91 అభియోగాల‌ను ఎదుర్కొంటున్నారు. గత కేసుల్లో కూడా ఆయన బెయిల్‌ పొందారు. ఇప్పటికే ట్రంప్‌పై చట్టపరంగా భారీగా ఆంక్షలున్నాయి.