పాక్ పై భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్.. 8 మంది ఉగ్రవాదుల హతం?

భారత్ మళ్లీ పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిన్నట్లు వార్తలు వెలువడ్డాయి. 12 నుండి 15 మంది కమాండోలు చేపట్టిన ఈ మిషన్ లో ఏడు నుంచి ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెబుతున్నారు.  భారత సైన్యం పాకిస్థాన్ లోకి చొరబడి శత్రువులను హతమార్చింది. 
 
రాజౌరీ, పూంచ్ జిల్లాల మధ్య నుండి నియంత్రణ రేఖను దాటి, జమ్మూ కాశ్మీర్‌లోని కోట్లిలోని నక్యాల్‌లో పనిచేస్తున్న ఉగ్రవాదుల నాలుగు లాంచింగ్ ప్యాడ్‌లను పూర్తిగా ధ్వంసం చేశారని కూడా చెబుతున్నారు. ఈ సర్జికల్ స్ట్రైక్‌లో భాగంగా మన సైనికులు దాదాపు రెండున్నర కిలోమీటర్లు లోపలికి వెళ్లి.. మిషన్ పూర్తి చేసి క్షేమంగా తిరిగి వచ్చారని కధనాలు వ్యాప్తి చెందాయి.
 
అయితే, మరోసారి పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు వచ్చిన వార్తలను రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తోసిపుచ్చింది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని మాత్రం భారత సైన్యం విఫలం చేసినట్లు తెలిపింది. ఇది సర్జికల్ స్ట్రైక్ కాదని వివరించింది.
 
భారత దేశ రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, బాలాకోట్ సెక్టర్, హమీర్‌పూర్ ప్రాంతంలో సోమవారం ఉదయం వాతావరణం దట్టమైన పొగమంచుతో కూడి ఉండటాన్ని ఇద్దరు ఉగ్రవాదులు అనుకూలంగా భావించారని, భారత దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారని, వీరిని మన సైన్యం గుర్తించిందని తెలిపింది.
 
ఇదిలావుండగా, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో మరోసారి భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని మంగళవారం ఉదయం ఓ వార్తా పత్రిక తెలిపింది. భారత సైన్యం శనివారం రాత్రి ఎల్ఓసీ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీరులోకి 2.5 కిలోమీటర్లు వెళ్లి, పాకిస్థానీ ఉగ్రవాదులకు చెందిన నాలుగు లాంచింగ్ పాడ్‌లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ వార్త వెలువడిన కొద్ది గంటల్లోనే రక్షణ మంత్రిత్వ శాఖ ఈ వివరణ ఇచ్చింది.
 
భారత భూభాగంపై (పూంచ్, రాజౌరీ జిల్లాలు) భారీ దాడికి చేయడానికి గత కొన్ని రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఈ లాంచింగ్ ప్యాడ్‌లలో ఉగ్రవాదులు ప్రణాళికలు చేస్తున్నారని భారత భద్రతా ఏజెన్సీలకు నిర్దిష్ట సమాచారం అందింది. ఈ లాంచింగ్ ప్యాడ్‌లపై పాకిస్థాన్ సైన్యం, దాని గూఢచార సంస్థ ఐఎస్ఐ, బ్యాట్ (బీఏటీ) బృందం కదలికలు కూడా పెరగడంతో భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది.
 
శత్రువులు ఈ విధ్వంసపూరిత ప్రణాళికను అమలు చేయకముందే భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి మొత్తం కుట్రను విఫలం చేసిందనే కధనాలు వెలువడుతున్నాయి. ఈ కధనాల ప్రకారం, భారత సైన్యంలోని స్పెషల్ ఫోర్సెస్‌కు చెందిన 12-15 మంది కమాండోలు రాజౌరీలోని తార్కుండి సెక్టార్, పూంచ్‌లోని భీంభర్ గలి మధ్య నుండి కాలినడకన నియంత్రణ రేఖను దాటారు. 
 
రాత్రి సమయంలో పూర్తి అప్రమత్తతతో ముందుకు సాగారు. గులామ్ జమ్మూ, కాశ్మీర్‌లోని కోట్లి జిల్లాలోని నకాయల్‌లో ఉగ్రవాదులకు చెందిన నాలుగు లాంచింగ్ ప్యాడ్‌లపై రెండున్నర కిలోమీటర్ల లోపలికి వెళ్లి దాడి చేశారు. ఉగ్రవాదులకు, బ్యాట్ సభ్యులకు తిరిగి దాడి చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. రెప్పపాటు క్షణంలో ఇదంతా జరిగి పోయింది. ఈ సర్జికల్ స్ట్రైక్ ను విజయవంతంగా ముగించుకొని భారత సైనికులు తిరిగి వచ్చారు.