నిర్మల్ లో బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి దీక్ష భగ్నం

నిర్మల్ లో బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి దీక్ష భగ్నం
నిర్మల్ నూతన మాస్టర్ ప్లాన్‌తో పాటు జీవో నెంబర్ 220ని రద్దు చేయాలంటూ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను సోమవారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. భారీ సంఖ్యలో చేరుకున్న అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయన దీక్షను విరమింప చేసేందుకు ప్రయత్నించారు.

వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి మహేశ్వర్ రెడ్డిని తరలించారు. అక్కడే ఆయనకు చికిత్స అందిస్తున్నారు.  మహేశ్వర్‌రెడ్డిని పోలీసులు అంబులెన్స్‌లో తరలిస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.  అయితే, ఆస్పత్రిలోనే మహేశ్వర్ రెడ్డి తన దీక్షను కొనసాగిస్తున్నారు. తన దీక్షను బలవంతంగా భగ్నం చేసేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్, జీవో నెంబర్ 220ని రద్దు చేసే వరకూ తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.
 
కాగా, మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించిన వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్య కోసం హైదరాబాద్ తరలించాలని భావించినా మహేశ్వర్ రెడ్డి అంగీకరించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్వర్ రెడ్డిని పలువురు బీజేపీ నేతలు పరామర్శించారు. ఆయన దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సీఎం కేసీఆర్, నిర్మల్ మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
మరోవైపు, నిర్మల్ మాస్టర్ ప్లాన్ కోసం తెచ్చిన జీవో 220ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం నిర్మల్ వెళ్లాలని నిర్ణయించారు. అంతేగాక, శనివారం పోలీసుల లాఠీఛార్జీలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను కూడా పరామర్శించాలని భావించారు. 
 
అయితే, అత్యవసరంగా పార్టీ నేతలతో సమావేశం కావాల్సి ఉండటంతో నిర్మల్ పర్యటనను కిషన్ రెడ్డి తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. కాగా, ఆదివారం నిర్మల్ వెళుతున్న మాజీ మంత్రి, బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్‌ను పోలీసులు అడ్డుకున్నారు.