అస్సాం ప్రభుత్వ ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్‌

భారతీయ జనతా పార్టీ నేత, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్‌ను నిర్దేశించింది. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఇకపై టీ-షర్టులు, జీన్స్, లెగ్గింగ్స్ వంటివాటిని ధరించరాదని ఆదేశించింది. ఇటువంటి దుస్తులు విశాల ప్రజానీకానికి ఆమోదయోగ్యం కాదని తెలిపింది. అస్సాం ఉన్నత విద్యా శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో, ఉన్నత విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు తమకు నచ్చిన దుస్తులను ధరించి, విధులకు హాజరవుతున్నట్లు గుర్తించామని చెప్పింది. 

ఇటువంటి దుస్తులకు విశాల ప్రజానీకం ఆమోదం లేదని తెలిపింది. పురుషులు చొక్కా, ప్యాంటు లేదా ధోతీ, పైజమా ధరించి విధులకు హాజరు కావాలని తెలిపింది. స్త్రీలు సల్వార్ సూట్, లేదా, చీర లేదా మెఖెలా-చడోర్ వంటి సంప్రదాయ వస్త్రాలను ధరించి హాజరుకావాలని తెలిపింది. ఫ్లాషీగా కనిపించని, పరిశుభ్రమైన, మర్యాదపూర్వకంగా ఉండే దుస్తులను ధరించాలని తెలిపింది. 

మర్యాదపూర్వక ప్రవర్తనకు నిదర్శనంగా ఉపాధ్యాయులను చూస్తామని, ముఖ్యంగా విధి నిర్వహణలో డ్రెస్ కోడ్‌ను పాటించవలసిన అవసరం ఉందని వివరించింది. హుందాతనం, వృత్తి నైపుణ్యం, పని చేసే చోట గంభీరత ఉట్టిపడేలా దుస్తులను ధరించాలని ఆదేశించింది.