లడక్ రోడ్డు ప్రమాదంలో 9 మంది సైనికుల మృతి

లఢక్‌లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. గత రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారత జవాన్లు కన్నుమూశారు. వీరిలో ఎనిమిది మంది జవాన్లు, ఒకరు జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.  
 
లేహ్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని కియారీ వద్ద శనివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. భారత జవాన్లు ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది జవాన్లు అక్కడికక్కడే కన్నుమూశారు. పలువురు గాయపడ్డారు.
 
ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో పది మంది సైనికులున్నట్లు ఆర్మీ అధికారులు చెప్పారు. మరో సైనికుడికి గాయాలయ్యాయి. లఢక్ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని క్యారీ టౌన్ సమీపంలో ఈ దుర్ఘటన సంభవించింది. క్యారీ టౌన్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఉన్న లోయలో అదుపు తప్పి పడిపోయింది జవాన్ల వాహనం. 
 
భారత్- చైనా వాస్తవాధీన రేఖకు దగ్గరగా ఉన్న కారు గ్యారిసన్ నుంచి ఈ వాహనం బయలుదేరింది. క్యారీ టౌన్‌కు చేరుకోవాల్సి ఉంది. మార్గమధ్యలో క్యారీ టౌన్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండగా  ప్రమాదానికి గురైంది. లోతైన అగాథంలో పడిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు. 
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది సైనికులు మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి సేవలను దేశం ఎప్పటికి గుర్తుంచుకుంటుందని చెబుతూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. 
 
లేహ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో భారత ఆర్మీ సిబ్బందిని కోల్పోవడం బాధాకరమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశానికి వారు చేసిన సేవలను ఎప్పటికీ మరువలేం అని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన సిబ్బందిని ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారని పేర్కొంటూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
లేహ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పీడీ నిత్య మీడియాతో మాట్లాడుతూ 10 మంది సిబ్బందితో ఆర్మీ వాహనం లేహ్ నుంచి న్యోమాకు వెళ్తుండగా, డ్రైవర్ నియంత్రణ కోల్పోయి సాయంత్రం 4.45 గంటలకు లోయలో పడిపోయిందని తెలిపారు. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన సైనికులందరినీ ఆర్మీ మెడికల్ ఆసుపత్రికి తరలించారని, అక్కడ ఎనిమిది మంది సిబ్బంది మరణించినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మరో జవాన్ చనిపోయారు.
తెలంగాణ వాసి మృతి

ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం పరిధిలోని తంగెళ్లపల్లి గ్రామ పంచాయతీలోని తిర్మాన్ దేవునిపల్లి గ్రామనికి చెందిన ఆర్మీ జవాన్ చంద్ర శేఖర్(30) కూడా ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిర్మాన్ దేవునిపల్లి గ్రామ నిరుపేద కుటుంబానికి చెందిన మల్లయ్య, శివమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. 

అందరిలో చిన్నవాడైన చంద్ర శేఖర్ ముదిరాజ్ తన చదువు ఒకటవ తరగతి నుండి 3 వరకు తిర్మాన్ దేవునిపల్లి గ్రామంలో, 4వ తరగతి నుండి 7 వరకు తంగెళ్లపల్లి గ్రామంలో తర్వాత కొందుర్గ్ బీసీ హాస్టల్ లో ఉంటూ 10వ తరగతి వరకు చదువుకున్నాడు. చిన్నప్పటి నుండి దేశ రక్షణ సేవలో పనిచేయాలని కోరిక ఉన్న శేఖర్ 10వ తరగతి అవ్వగానే దేశ సేవకోసం అర్మిలో జాయిన్ అయ్యాడు.

చంద్ర శేఖర్ తల్లిని, భార్య, పిల్లలను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని గ్రామం మొత్తం మీ వెంట ఉంటుందని బారోసా ఇచ్చారు. వీరుడా తంగెళ్లపల్లి నీకు సెల్యూట్ చేస్తుంది.. నీ స్పూర్తితో ముందుకు పోతాం.. శేఖర్ మరణం తీరని లోటని వారు తెలియజూశారు.