తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకే ప్రజల పట్టం

తెలంగాణాలో  ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ప్రజలు బిజెపికే పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి భరోసా వ్యక్తం చేశారు. శనివారం ఆయన అధ్యక్షతన సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌లో బిజెపి ఎమ్మెల్యే ప్రవాస్ వర్క్‌షాప్‌లో కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి వచ్చిన 119 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎన్నికలు వస్తేనే పథకాలు గుర్తుకు వస్తాయని ధ్వజమెత్తారు. బిజెపి 18 రాష్ట్రాల్లో పాలిస్తుందని, అక్కడ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని గుర్తు చేశారు. తెలంగాణలో అభివృద్ధి కావాలంటే బిజెపి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

బిజెపి ఎన్నికలకు అన్నిరకాలుగా సిద్దమవుతోందని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ తెలిపారు. రాష్ట్రంలో బిఅర్‌ఎస్ చేసిన దోపిడీ, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వెల్లడించారు. వారం రోజుల పాటు తెలంగాణలో వివిధ రాష్ట్రాల కు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల ఆకాంక్షల మీద నివేదికను అందజేస్తారని తెలిపారు.

“అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. తెలంగాణకు పట్టిన 9 సంవత్సరాల పీడా విరుగుడు కాబోతోంది. కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూ పోతున్నారు. ఎన్నికలు వస్తేనే పథకాలు కేసీఆర్‌కు గుర్తువస్తాయి. రాజకీయాల్లో జంపింగ్‌లు కామన్. దోచుకుని అడ్డమైన గడ్డి తిని ఇప్పుడు సినిమా చూపిస్తాం అంటున్నారు. బీజేపీని ఎదుర్కొలేకనే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు మత చిచ్చు పెడుతున్నాయి” అంటూ ఆమె ధ్వజమెత్తారు. 

బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడ అయిన దాడులు జరిగాయా..? అని అరుణ ప్రశ్నించారు. సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్, కాంగ్రెస్ మత చిచ్చు పెడుతున్నాయని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా ఉండాలంటే బీజేపీకి ఓటు వేయాలని ఆమె స్పష్టం చేశారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రవాస్ వర్క్‌షాప్ తెలంగాణ ఇన్‌చార్జ్, ఎంపి అప్రజిత సారంగి తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జ్ ప్రకాష్ జవదేకర్, అరవింద్ మీనన్, మధ్యప్రదేశ్ ఇన్‌చార్జ్ మురళీధర్ రావు, జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, ఈటల రాజేందర్, బంగారు శృతి, ప్రదీప్‌కుమార్,నల్లు ఇంద్రసేనారెడ్డి, బిజెపి జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.