నిర్మల్ లో బిజెపి నేతలపై లాఠీఛార్జ్.. కిషన్ రెడ్డి  ఆగ్రహం

* క్షీణిస్తున్న మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం
నిర్మల్ టౌన్ న్యూ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి నేత, మాజీ ఎమ్యెల్యే  ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష శనివారం నాలుగో రోజుకు చేరుకుంది.  మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం గంట గంటకు విషమిస్తుండ‌టంతో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోతున్నట్టు వైద్యులు నిర్దారించారు. మహేశ్వర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పట్ల ఆయన కుటుంబ సభ్యులు, బీజేపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలో పట్టణ కొత్త మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన బీజేపీ నేతలు, కార్యకర్తలపై శనివారం పోలీసులు లాఠీఛార్జ్ జరపడంతో ఉద్రిక్తత నెలకొంది.  బీజేపీ శ్రేణులు శనివారం సాయంత్రం మెరుపు ధర్నాకు దిగాయి. నిర్మల్‌లోని బస్టాండ్‌ ఎదుట ఆ పార్టీ ముఖ్య నాయకులతో పాటు వందల సంఖ్యలో కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

దాదాపు గంట సేపు ఆందోళనకు దిగడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జిల్లా కలెక్టర్‌ వచ్చి మాస్టర్‌ ప్లాన్‌పై ప్రకటన చేయాలంటూ పార్టీ కార్యకర్తలు, నాయకులు డిమాండ్‌ చేయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఆందోళనకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వివాదం చోటుచేసుకొంది. ఈ సందర్భంగా బీజేపీ నేతలను పోలీసులు బలవంతంగా  అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. ఆందోళన చేస్తున్న వారిపై లాఠీఛార్జ్ కు ఉపక్రమించారు.  

కాగా, రాస్తారోకో చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులతో కేసీఆర్ సర్కారు దాడి చేయించడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి దీక్షాశిబిరాన్ని సంద ర్శించి మహేశ్వర్‌రెడ్డికి సంఘీభావం తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల భూదందా కోసమే మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యవ సాయ భూములను కమర్షియల్‌ జోన్‌గా మార్చడం, గ్రీన్‌ జోన్‌ను ఇండస్ర్టియల్‌గా మార్చడం.. ఇలా ఇష్టం వచ్చినట్లు చేస్తూపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

ప్రజాసమస్యలపై స్పందించడం చేతకాని ప్రభుత్వం నిర్మల్ మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ 4 రోజులుగా అమరణ నిరాహార దీక్ష బీజేపీ  చేస్తున్న మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తున్నా స్పందించకపోవడం దారుణమని కిషన్ రెడ్డి మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ నిర్మల్ బస్టాండ్ ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు రాస్తారోకో చేస్తే  పోలీసులు లాఠీచార్జి చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనలో గాయపడిన పలువురు రైతులకు అవసరమైన చికిత్స అందించాలని జిల్లా  నాయకులకు కిషన్ రెడ్డి సూచించారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వీటిని  పట్టించుకోకపోగా, ప్రజావ్యవస్థను మరింత సంక్లిష్టంగా మారుస్తుందని ధ్వజమెత్తారు. నిర్మల్ మాస్టర్ ప్లాన్ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వెనక్కి తీసుకోకపోతే కేసీఆర్ నిద్రలేని రాత్రులు గడపాల్సిందేనని హెచ్చరించారు.