దేశంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసును బెంగళూరులో ప్రారంభించారు. రోబోటిక్ ప్రింటర్ సాయంతో తయారు చేసిన కాంక్రీట్ లేయర్ల సాయంతో ఈ కట్టడాన్ని 45 రోజుల్లో పూర్తి చేశారు. మద్రాస్ ఐఐటీ సాంకేతిక సహకారంతో ఎల్ అండ్ టీ సంస్థ రెసిడెన్షియల్ కేంబ్రిడ్జ్ లే అవుట్ ప్రాంతంలో ఈ నిర్మాణాన్ని చేపట్టింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్మించిన ఈ తపాలా కార్యాలయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికత ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయని.. సంప్రదాయ భవన నిర్మాణ పద్ధతులకు ఇది ప్రత్యామ్నాయమని తపాల శాఖ అధికారులు వెల్లడించారు
నిర్మాణ పనులు సాగిన తీరు, కార్యాలయంలోని సౌకర్యాలను చూపుతోన్న ఓ వీడియోను కేంద్ర మంత్రి ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తికి ఈ ‘త్రీడీ పోస్టాఫీస్’ నిదర్శమని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘త్రీడీ పోస్టాఫీసు’పై స్పందిస్తూ.. ప్రతి భారతీయుడు దీన్ని చూసి గర్వపడతారని పేర్కొన్నారు. స్వావలంబన స్ఫూర్తిని ఇది ప్రతిబింబిస్తోందని ట్వీట్ చేశారు.
ఇక్కడి కేంబ్రిడ్జ్ లేఅవుట్‌లో 1021 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీని నిర్మాణం చేపట్టారు. ఆధునిక ‘త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ’ సాయంతో కేవలం 45 రోజుల వ్యవధిలోనే పనులు పూర్తి చేయడం విశేషం. అదే సంప్రదాయ పద్ధతిలో నిర్మిస్తే దాదాపు ఎనిమిది నెలలు పడుతుందని అధికారులు చెప్పారు. మద్రాస్ ఐఐటి సాంకేతిక సహకారంతో ఎల్‌టి సంస్థ దీన్ని నిర్మించినట్లు తెలిపారు.
More Stories
మహా కుంభమేళాతో 12 లక్షల ఉద్యోగాలు
అటల్ పెన్షన్ యోజన రూ.10వేలకు పెంపు?
నిషేధానికి ముందే అమెరికాలో టిక్ టాక్ నిలిపివేత