బీహార్‌లో జర్నలిస్టు కాల్చివేత

బీహార్ లో శాంతిభద్రతల పరిస్థితులు దారుణంగా పరిణమిస్తున్నాయి. గతంలో హత్యకు గురైన ఓ జర్నలిస్టు హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న, అతని తమ్ముడైన జర్నలిస్ట్ శుక్రవారం దారుణంగా హత్యకు గురయ్యాడు. బీహార్‌లోని అరారియా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఒక హిందీ దినపత్రికలో పనిచేస్తున్న విమల్ కుమార్ యాదవ్(35)ను ప్రేమ్‌నగర్ గ్రామంలోని ఆయన నివాసంలోనే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.
 
తెల్లవారుజామున 5.30 గంటలకు యాదవ్ ఇంటి తలుపులు తట్టిన దుండగులు ఆయన తలుపులు తెరిచిన వెంటనే కాల్పులు జరిపినట్లు బీహార్ పోలీసులు ట్వీట్ చేశారు. చాదవ్ అక్కడికక్కడే మరణించాడు. సంఘటనా స్థలానికి సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అశోక్‌కుమార్‌ సింగ్‌, ఫోరెన్సిక్‌ బృందం, డాగ్‌ స్క్వాడ్‌ చేరుకున్నారు. శవపరీక్ష కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్‌ బృందానికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. 
 
తనకున్న శత్రుత్వం వల్లే విమల్‌ యాదవ్‌ హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. రెండేళ్ల క్రితం సర్చంచ్‌గా ఉన్న విమల్‌ సోదరుడు కూడా ఇలాగే హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో విమల్‌ని కూడా చంపేస్తామని బెదిరించినప్పటికీ అతను మాత్రం.. కోర్టులో హంతకుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. ఈ నేపథ్యంలోనే అతను హత్యకు గురైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణ తేలింది.
 
ఈ ఘటనపై జర్నలిస్టులు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కలుసుకోగా ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, జర్నలిస్ట్ యాదవ్ హత్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి.  నేరగాళ్లు స్వేచ్ఛగా వీధుల్లో తిరుగుతున్నారని, జర్నలిస్టులు సహా అమాయక పౌరులు, చివరకు పోలీసు అదికారులు హత్యకు గురవుతున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి ఆరోపించారు. 
 
కాగా బీహార్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని నితీశ్ కుమార్, ఆయన మిత్రులు గగ్గోలు పెడుతున్నారని, కానీ వాళ్లు ఫోర్త్ ఎస్టేట్(పత్రికా రంగం)కు కూడా రక్షణ కల్పించలేకపోతున్నారని లోక్‌జనశక్తి పార్టీ మాజీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ విమర్శించారు. సమస్తిపూర్‌లో ఇటీవల పోలీసు అధికారి హత్యను ప్రస్తావిస్తూ సామాన్య ప్రజలు ఎప్పుడో నితీశ్ కుమార్‌పై నమ్మకాన్ని కోల్పోయారని, అయితే ఆయన ప్రభుత్వం పోలీసులు, ప్రెస్‌ను సైతం కాపాడలేకపోయిందని ధ్వజమెత్తారు.