ఓ జంట హత్యల కేసులో దోషిగా ఆర్జేడీ మాజీ ఎంపీ

28 ఏళ్ల కిందట జంట హత్యల కేసులో బిహార్‌కు చెందిన మాజీ ఎంపీని సర్వోన్నత న్యాయస్థానం దోషిగా నిర్దారించింది. ఆర్జేడీ నేత ప్రభునాథ్ సింగ్‌‌ను1995లో జరిగిన జంట హత్యల కేసులో దోషిగా తేల్చింది. 2008లో పాట్నా హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఆగస్టు 23, 1995న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు ఓటువేయనందకు రాజేంద్ర రాయ్, దరోగ రాయ్‌లను ప్రభునాథ్ ఆదేశాలతో ఛప్రాలో కాల్చి చంపారు. 
అయితే, సాక్షులను బెదిరిస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపించడంతో ఈ కేసును ఛప్రా నుంచి పాట్నాకు మార్చారు.  సరైన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో ప్రభునాథ్ సింగ్‌పై నమోదయిన అభియోగాలను పాట్నా కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును 2012లో పాట్నా హైకోర్టు సమర్థించింది. దీంతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రభునాథ్‌ను దోషిగా తేల్చింది.
 
 ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించిన న్యాయస్థానం సెప్టెంబరు 1న కోర్టులో ప్రభునాథ్‌ సింగ్‌ను హాజరుపరచాలని ఆదేశించింది. ఆ తర్వాత శిక్షను ఖరారు చేస్తామని పేర్కొంది. బాధితుల తరఫున న్యాయవాది అభయ్ కుమార్ కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడుతూ  ఈ కేసులో మిగతా నిందితులను నిర్దోషులుగా నిర్దారించిన సుప్రీంకోర్టు ప్రభునాథ్ సింగ్‌ను మాత్రం దోషిగా పేర్కొందని చెప్పారు.
 
సెప్టెంబరు 1న ప్రభునాథ్ సింగ్‌ను కోర్టులో హాజరుపరచాలని బిహార్ డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలకు స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. అయితే, మరో హత్య కేసులో ప్రస్తుతం ప్రభునాథ్ సింగ్ యావజ్జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.  జనతా దళ్ నేత అశోక్ సింగ్ హత్య కేసులో ప్రభునాథ్ సింగ్ సహా ఆయన ఇద్దరు సోదరులను 2017లో కోర్టు దోషులుగా నిర్దారిస్తూ యావజ్జీవిత ఖైదు విధించింది.
బిహార్‌కు బదులు ఝార్ఖండ్‌లో ఈ కేసు విచారించాలని అశోక్ భార్య డిమాండ్ చేశారు. 1995 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభునాథ్ సింగ్‌ను అశోక్ సింగ్ ఓడించారు.  అయితే, ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది రోజులకే ఆయన పట్నాలోని తన అధికారిక నివాసంలో జరిగిన పేలుడులో మృతిచెందారు. ఎన్నికలైన మూడు నెలల్లోగా అశోక్‌ తన చేతుల్లో చావడం ఖాయమని ఒకానొక సందర్భంలో ప్రభునాథ్ బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డారు.
దీంతో ఆయనే హత్య చేయించినట్టు కోర్టు నిర్దారించింది.  బీహార్‌లోని మహారాజ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు పొందిన ప్రభునాథ్ సింగ్ 1995 వరకూ జనతాదళ్‌లో ఉన్నారు. అనంతరం జేడీయూ, తర్వాత ఆర్జేడీలో చేరారు.