21 మంది భారతీయ విద్యార్థులను వెన‌క్కి పంపిన అమెరికా

అమెరికా వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలనే  కల నెరవేర్చుకునేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. ఎయిర్‌పోర్ట్‌లో దిగీ దిగగానే అక్కడి అధికారులు వారి పత్రాలు సరిగా లేవంటూ గంటలపాటు నిర్బంధించి, తిరిగి ఢిల్లీకి పంపించివేశారు. 21 మంది భారతీయ విద్యార్థులకు అమెరికాలోని పలు విమానాశ్రయాల్లో ఈ చేదు అనుభవం ఎదురైంది. వీరిలో విజయవాడకు చెందిన ఒక యువతితోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యారులు ఉన్నట్లు తెలుస్తోంది.
అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం విద్యార్థులు అమెరికా వెళ్లగా సరైన పత్రాలు లేవంటూ అనుమతి నిరాకరించారు.  యూనివర్సిటీల్లో అడ్మిషన్ సాధించి వీసా ప్రక్రియలను పూర్తి చేసినప్పటికీ సమస్య తలెత్తడంతో ఆయా విద్యార్థులను అధికారులు తిరిగి ఇండియాకు పంపిస్తున్నారు.
యూనివర్సిటీల నుంచి అడ్మిషన్లు పొందినట్లు ఈ- మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేసిన తర్వాత కూడా అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో నుంచి మొత్తంగా 21 మంది విద్యార్థులను ఎయిర్‌ ఇండియా విమానంలో తిప్పి భారత్‌కు పంపించారు.
ఇమిగ్రేషన్‌ చెక్‌ పూర్తి కాగానే అక్కడి అధికారులు వారి డాక్యుమెంటేషన్‌ (అధికారిక పత్రాలు) సరిగా లేవంటూ నిర్బంధించారు. విద్యార్థుల ఈమెయిళ్లు, సోషల్‌ మీడియా అకౌంట్లు తనిఖీ చేశారు. వారి సెల్‌ఫోన్లను, ల్యాప్‌టా్‌పలను స్వాధీనం చేసుకున్నారు. ఇరుకు గదుల్లో దాదాపు 16 గంటలకుపైగా కూర్చోబెట్టారు. తక్షణం తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఏమిటీ అన్యాయం అని ప్రశ్నించిన విద్యార్థులపై అధికారులు కన్నెర్ర చేశారు. ఆదేశాలను పాటించకపోతే జైలుకు పంపుతామని హెచ్చరించారు. సమస్య గురించి స్వదేశంలో ఉన్న తమ తల్లిదండ్రులకు చెప్పుకొందామని ప్రయత్నిస్తే కూడా విద్యార్థులకు ఆ అవకాశం ఇవ్వలేదు.

అమెరికాలో వీసా నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఒకసారి ఆ దేశం నుంచి అధికారులు వెనక్కి పంపిస్తే తర్వాత ఐదేళ్లపాటు అమెరికాకు వెళ్లటానికి అనుమతి లభించదు. అంటే, ఈ 21 మంది విద్యార్థులకు అమెరికా వెళ్లే అవకాశాలు ఐదేళ్లపాటు మూసుకుపోతాయి. గతంలో నకిలీ వర్సిటీలలో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులను ఈ విధంగా వెనక్కి పంపిన ఉదంతాలు ఉన్నాయి.

కానీ, ఈసారి భారతీయ విద్యార్థులు సెయింట్‌ లూయిస్‌, డకోటా స్టేట్‌ వంటి ప్రముఖ యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ తీసుకున్నారు. అయినప్పటికీ, అవమానకరంగా తిప్పి పంపించటం ఏమిటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో అమెరికాకు వెళుతున్న భారతీయ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అన్ని ప‌త్రాలు స‌క్ర‌మంగా ఉన్నా తిప్పి ఎందుకు పంప‌తున్నారో అంటూ విద్యార్ధుల ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. భార‌తీయ విదేశాంగ శాఖ అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాల‌ని వేడుకుంటున్నారు.