“ఐఎన్‌ఎస్ వింధ్యగిరి” ని ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము

భారత నౌకాదళంలో సేవలందించనున్న సరికొత్త యుద్ధనౌక “ఐఎన్‌ఎస్ వింధ్యగిరి” ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించారు. పశ్చిమబెంగాల్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కోల్‌కతా లోని హుగ్లీ నది ఒడ్డునున్న గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇండో- పసిఫిక్ ప్రాంతంలో, ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతా ప్రమాదాలను ఎదుర్కొనేందుకు నావికాదళం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రపతి పిలుపిచ్చారు. ఈ యుద్ధ  నౌక ఆవిష్కరణ  భారతదేశపు సముద్ర భద్రతా సామర్థ్యంలో సరికొత్త ముందడుగు అని ఆమె అభివర్ణించారు.

పైగా, మన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఇదొక ముందడుగు అంటూ అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలో మన స్వదేశీ సామర్ధ్యాలను సహితం ఈ నౌక ప్రదర్శిస్తుందని ఆమె చెప్పారు. మన దేశం ప్రపంచంలో నేడు ఇదో పెద్ద ఆర్ధిక వ్యవస్థ అని, మూడో పెద్ద వ్యవస్థ అయ్యేందుకు కృషి చేస్తుందని ఆమె గుర్తు చేశారు.

పెద్ద ఆర్ధిక వ్యవస్థ అంటే వాణిజ్యం, వ్యాపార కార్యకలాపాలు పెరుగుతూ ఉంటాయని, అవి ఎక్కువగా సముద్ర మార్గంలో జరుగుతూ ఉంటాయని ముర్ము తెలిపారు. అందుకనే సముద్ర భద్రత మన సంపదకు, అభివృద్ధికి సూచిక అని ఆమె తెలిపారు.

గవర్నర్ సివి ఆనంద్ బోస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. `ప్రాజెక్ట్ 17 ఆల్ఫా’లో భాగంగా నావికాదళం కోసం భారత్ నిర్మించదలచిన ఏడు యుద్ధ నౌకలలో ఇది ఆరవది కావడం గమనార్హం. మొదటి ఐదు నౌకలను 2019 నుండి 2022 మధ్య ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు క్రింద నిర్మిస్తున్న నౌకలకు అవసరమైన  ముడి పదార్ధాలలో 75 శాతం మేరకు ఎంఎస్ఎంఇ లతో పాటు స్థానిక వనరుల ద్వారానే సమకూర్చుకుంటున్నారు.

ఈ సందర్భంగా అధునాతన స్టెల్త్ యుద్ధ నౌకను నౌకాదళం లోకి ప్రవేశ పెట్టారు. వింధ్యగిరి కర్ణాటక రాష్ట్రంలోని ఓ పర్వత శ్రేణి పేరు. ఇదే పేరుతో గతంలో ఉన్న యుద్ధ నౌక 31 ఏళ్ల పాటు సేవలందించింది. 2012 దాకా అది పలు క్లిష్టతరమైన ఆపరేషన్లలో పాల్గొని సత్తా చాటింది. ఈ ఐఎన్‌ఎస్ వింధ్యగిరిలో సరికొత్త గ్యాడ్జెట్‌లను అమర్చనున్నారు. దీనిని నౌకాదళానికి అప్పగించే ముందు విస్తృత స్థాయిలో వివిధ రకాలుగా పరీక్షించి చూస్తామని అధికారులు తెలిపారు. కాగా పీ17ఏ నౌకలన్నీ గైడెడ్ మిస్సైల్ సామర్థం కలిగి ఉన్నాయి.

ఒక్కో నౌక పొడవు 149 మీటర్లు ఉంటుంది. 6670 టన్నుల బరువుతో ఇవి 28 నాట్స్ వేగంతో ప్రయాణించగలవని ఓ అధికారి తెలిపారు. ఇవి శివాలిక్ క్లాస్ ప్రాజెక్టు 17 యుద్ధ నౌకల కంటే మెరుగైనవని చెప్పారు. అధునాత ఆయుధాలు, సెన్సార్లు , ప్లాట్‌ఫామ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లు, వీటిలో పొందుపర్చనున్నట్టు వెల్లడించారు.

 భూమి, ఆకాశం , నీటి లోపల నుంచి ఎదురయ్యే సవాళ్లకు ఇవి దీటుగా బదులిస్తాయని రక్షణ శాఖ తెలిపింది. దేశ ర‌క్ష‌ణ ప‌ట్ల త‌న నిబ‌ద్ధ‌త‌ను పున‌రుద్ఘాటిస్తూ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్‌) భార‌త‌దేశ‌పు ఆర‌వ స్వ‌దేశీ యుద్ధ‌నౌక వింధ్య‌గిరి నిర్మాణం కోసం మొత్తం 4000 ట‌న్నుల ప్ర‌త్యేక  ఉక్కును స‌ర‌ఫ‌రా చేసింది. ఈ విమాన వాహ‌క నౌక నిర్మాణం కోసం సెయిల్ మొత్తం 30వేల ట‌న్నుల ప్ర‌త్యేక ఉక్కును అందించింది.