ఆలయాల అభివృద్ధి నిధులను ఆపేసిన కర్ణాటక ప్రభుత్వం 

ఆలయాల అభివృద్ధి నిధులను ఆపేసిన కర్ణాటక ప్రభుత్వం 

రాష్ట్రంలోని అన్ని ఆలయాల అభివృద్ధికి అందించే నిధులను నిలిపివేస్తూ కర్నాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దుమారం రేపుతోంది. ఈ మేరకు ఈ నెల 14వ తేదీన సర్క్యులర్​ జారీ అయ్యింది. 2022- 23 సంవత్సరానికి గాను ఇప్పటికే ఆమోదించిన ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయరాదని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో వెల్లడించింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఆగస్టు 14న హిందూ మత సంస్థలు, ధర్మాదాయ శాఖ కమిషనర్ అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్‌లకు సాధారణ కార్యక్రమం కింద ఆమోదించిన నిధులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేయాలని ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. 

అయితే నిధులు ఎందుకు నిలుపుదల చేశారో అర్థంకావడం లేదని చాలామంది అంటున్నారు. కాగా, రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత దేవాలయాలకు యాత్రికుల రద్దీ విపరీతంగా ఉండటం ఇక్కడ గమనించదగ్గ విషయం.

ముజ్రాయి మాజీ మంత్రి శశికళ జోలె ఈ నిర్ణయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ పాలనలో దేవాలయాలకు, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చామని, ఇప్పుడు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు నిలిపివేసిందని ఆమె మండిపడ్డారు.

తాము ఇప్పటికే మొదటి విడతను విడుదల చేసామని, ఎన్నికల  ప్రవర్తనా నియమావళి కారణంగా రెండో విడత నిలిపివేశారని ఆమె తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మొత్తానికే నిధులు ఆపేస్తున్నట్టు ప్రకటించిందని ఆమె విస్మయం వ్యక్తం చేశారు.  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హిందూ వ్యతిరేక చర్యగా అభివర్ణించారు.