దేశ అత్యుత్తమ స్ప్రింటర్‌పై నాలుగేళ్ల నిషేధం

దేశంలోని అత్యుత్తమ స్ప్రింటర్, ప్రస్తుతం 100 మీటర్ల రేసు నేషనల్ రికార్డు ఉన్న ప్రముఖ అథ్లెట్ ద్యుతీ చంద్ నిషేధానికి గురైంది. ఆమెపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్ లో నిర్వహించిన డోపింగ్ టెస్టులో ఆమె విఫలమైంది. ఈ నాలుగేళ్ల నిషేధం ఈ ఏడాది జనవరి 3 నుంచే అమల్లోకి వచ్చిందని నాడా వెల్లడించింది.

గత ఏడాది డిసెంబర్ 5న ద్యుతీ చంద్ నుంచి నమూనాలు సేకరించారు. దీంతో ఆ తేదీ నుంచి ఆమె సాధించిన విజయాలు, మెడల్స్, పాయింట్లు, ప్రైజులన్నింటిపై అనర్హత వేస్తున్నట్లు నాడా స్పష్టం చేసింది. వాడా నిబంధనలను అనుగుణంగా ద్యుతీ ఎ శాంపిల్ ను టెస్ట్ చేశారని, అందులో నిషేధిత ఉత్ప్రేరకం కనిపించినట్లు ఆమెకు రాసిన లేఖలో నాడా తెలిపింది.

అయితే శాంపిల్ ఎ ఫలితాన్ని సదరు అథ్లెట్ అంగీకరించకపోతే శాంపిల్ బి టెస్టు కోసం కోరవచ్చు. దీనికి అయ్యే ఖర్చులను ఆ అథ్లెటే భరించాల్సి ఉంటుంది. ఒకవేళ శాంపిల్ బి టెస్టింగ్ అవసరం లేదని భావిస్ శాంపిల్ ఎ ఫలితాన్ని అంగీకరించినట్లే. ప్రస్తుతానికి నమూనా ఎ ఫలితం ఆధారంగా ద్యుతీ చంద్ పై నిషేధం విధిస్తున్నట్టు ఆ లేఖలో నాడా చెప్పింది.

ఈ నిషేధం పూర్తయ్యే వరకు ఆమె ఎలాంటి పోటీల్లోనూ పాల్గొనడానికి అవకాశం ఉండదు. ఈ నిషేధంపై విచారణ కోరే అవకాశం ద్యుతీకి ఉంటుంది.  నిషేధానికి సంబంధించిన లేఖ అందుకున్నప్పటి నుంచి 21 రోజులలోపు తనపై విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ ద్యుతీచంద్‌ రివ్యూ పిటిషన్‌ వేసుకోవచ్చని తెలిపింది.

ఒకవేళ నమూనా బి ఫలితంలోనూ నిషేధిత ఉత్ప్రేరకం ఉందని తేలితే మాత్రం నిషేధం కొనసాగుతోంది. ఇక ఈ నిషేధిత ఉత్ప్రేరకం తన రక్తంలో ఎందుకు ఉందో వివరణ ఇచ్చే అవకాశం కూడా ద్యుతీకి నాడా కల్పించింది. లిఖితపూర్వకంగా ఆమె తన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి తగిన ఆధారాలు కూడా జోడించాలి. 

ద్యుతీ చంద్ ఇండియాకు చెందిన టాప్ స్ప్రింటర్, 2018 ఏషియన్ గేమ్స్ లోనూ ఆమె 100, 200 మీటర్ల రేసులో సిల్వర్ మెడల్స్ గెలిచింది. 2013, 2017, 2019 ఏషియన్ ఛాంపియన్షిప్స్ లోనూ ద్యుతీ బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకుంది. 2019లో యూనివర్సియేడ్ లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఇండియన్ వుమన్ స్ప్రింటర్ గా రికార్డు నెలకొల్పింది.