ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థల పన్నుల బాకీ రూ. 45 వేల కోట్లు

ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలు రూ. 45,000 కోట్ల పన్ను బాకీలు ఉన్నయని ప్రభుత్వం అంచనా వేసింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో, గుర్రపు పందెలపై ప్రభుత్వం 28 శాతం జీఎస్టీ విధించిన విషయం విధితమే. పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ సెంట్రల్‌ బోర్డ్‌ (సీబీఐటీ) 2017 నుంచి ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థల పన్నుల మదింపు చేసింది. 

ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలపై చట్ట పరంగా 28 శాతం జీఎస్టీకి బదులుగా గేమింగ్‌ కంపెనీలు వారి నైపుణ్యం ఆధారిత గేమ్‌ల స్థూల రాబడిపై 18 శాతం పన్ను చెల్లించాయి. దీని వల్ల రూ. 45 వేల కోట్ల పన్నులను ఈ కంపెనీలు తక్కువ చెల్లించాయని సీబీఐసీ అధికారులు తెలిపారు. 28 శాతం జీఎస్టీని స్కిల్‌ ఆధారితంగా కాకుండా, మొత్తం గేమింగ్‌ రెవెన్యూపై వసూలు చేయాలని నిర్ణయించారు. 

గతంలో చెల్లించిన 18 శాతానికి ఉన్న ఆదాయానికి, కొత్త నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఆదాయాన్ని లెక్కిస్తే గేమింగ్‌ కంపెనీలు ప్రభుత్వానికి రూ. 45,000 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ విషయంలో అవకాశం ఆధారితంగానా, నైపుణ్యం ఆధారితంగా వర్గీకరించాలా అన్నదానిపై చాలా కాలం చర్చ జరిగింది. కొన్ని ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలు తమ సేవలు నైపుణ్యం ఆధారిత కార్యకలాపాలకు సంబందించినవని వాదించాయి. 

నైపుణ్యం ఆధారిత గేమింగ్స్‌కు 18 శాతం జీఎస్టీని వసూలు చేశారు. జీఎస్టీ కౌన్సిల్‌ ఈ వ్యత్యాసాన్ని రద్దు చేసేందుకు చట్టాలను సవరించింది. ఈ చట్టాలను పార్లమెంట్‌ కూడా ఆమోదించింది. ఇక నుంచి కొత్త నిబంధనల ప్రకారం పందెం విలువపై 28 శాతం జీఎస్టీ చెల్లించాడాన్ని తప్పనిసరి చేసింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌లో రియల్‌ మనీ గేమింగ్‌ సంస్థలు 77 శాతం వాటాతో అధిపత్యం కలిగి ఉన్నాయి. ఈ సంస్థలు 2017 నుంచి రూ. 5 వేల కోట్ల పన్ను మాత్రమే చెల్లించాయి. 

వాస్తవ పన్ను రూ. 50,000 కోట్లకు పైగా ఉన్నట్లు సీబీఐసీ అధికారులు గుర్తించారు. ఆఫ్‌షోర్‌ గేమింగ్‌ సంస్థలు రూ. 12 వేల కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడ్దాయి. గేమ్స్‌క్రాఫ్ట్‌ రూ. 21వేల కోట్ల పన్నులు చెల్లించాల్సి ఉంది. పన్నుల విషయంలో గేమ్స్‌కార్ట్‌కు ఇచ్చిన నోటీస్‌లను కర్నాటక హై కోర్టు సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేంద్రం ఈ నెలలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 

ప్రతి ఆన్‌లైన్‌ మనీ గేమింగ్‌ కంపెనీలు 28 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని, ఈ కంపెనీలు బ్యాలెన్స్‌ పన్నును చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు. జీఎస్టీ చట్లాల్లో చేసిన మార్పులను పార్లమెంట్‌ ఆమోదించనందున తప్పనిసరిగా ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలు నిర్దేశించిన పన్ను చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.