రెట్టింపైన ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా ఉన్నా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మెరుగైన ప్రగతిని కనబర్చాయి. ఆదాయ, లాభాల్లో అదరగొట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో అన్ని పిఎస్‌బిలు స్థూలంగా రూ.34,774 కోట్ల నికర లాభాలు సాధించాయి. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రూ.15,306 కోట్ల లాభాలు ప్రకటించాయి.

దీంతో పోల్చితే గడిచిన క్యూ1 లాభాల్లో రెట్టింపు పైగా ప్రగతిని సాధించాయి. అధిక నికర వడ్డీ ఆదాయం, నికర వడ్డీ మార్జిన్లు బ్యాంక్‌లకు ప్రధాన మద్దతును అందించాయి. మొండి బాకీలు భారీగా తగ్గడం కలిసి వచ్చింది. 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అధిక నికర వడ్డీ మార్జిన్లు (ఎన్‌ఐఎం) సాధించిన వాటిలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బిఒఎం) అగ్రస్థానంలో ఉంది. ఆ బ్యాంక్‌ ఎన్‌ఐఎం 3.86 శాతంగా చోటు చేసుకుంది.

ఆ తర్వాత స్థానంలో సెంట్రల్‌ బ్యాంక్‌ 3.62 శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ 3.61 శాతం చొప్పున ఎన్‌ఐఎంను నమోదు చేశాయి. ఏడాదికేడాదితో పోల్చితే గడిచిన క్యూ1లో పిఎస్‌బిల నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 26.3 శాతం వృద్థితో రూ.99,114 కోట్లకు చేరాయి. రుణాల జారీలో 16 శాతం పెరుగుదల నమోదయ్యింది. డిపాజిట్లు 13.2 శాతం వృద్థి చోటు చేసుకుంది. 

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి) రికార్డ్‌ స్థాయిలో వృద్థిని నమోదు చేసింది. పిఎన్‌బి 307 శాతం వృద్థితో రూ.1.255 కోట్ల నికర లాభాలు సాధించింది. 2022-23 క్యూ1లో రూ.308 కోట్ల లాభాలతో సరిపెట్టుకుంది. దేశంలో దిగ్గజ విత్త సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) గడిచిన త్రైమాసికంలో 178 శాతం వృద్థితో రూ.16,884 కోట్ల నికర లాభాలు సాధించింది. పిఎస్‌బిల మొత్తం లాభాల్లో ఎస్‌బిఐ సగం వాటాను కలిగి ఉండటం విశేషం. 

మరో ఐదు పిఎస్‌బిలు 50-100 శాతం వృద్థిని సాధించగా అందులో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర టాప్‌లో ఉంది. బిఒఎం 95 శాతం పెరుగుదలతో రూ.882 కోట్ల లాభాలు ఆర్జించింది. ఆ తర్వాత స్థానంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 88 శాతం వృద్థితో రూ.4,070 కోట్ల లాభాలు ప్రకటించింది. యూకో బ్యాంక్‌ 81 శాతం పెరిగి రూ.581 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. 

గడిచిన జూన్‌ త్రైమాసికంలో డజన్‌ పిఎస్‌బిల్లో ఢిల్లీ కేంద్రంగా పని చేస్తోన్న పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌ ఒక్కటి మాత్రమే 25 శాతం తగ్గుదలతో రూ.153 కోట్ల లాభాలు నమోదు చేసింది. బ్యాంక్‌ల స్థూల నిరర్థక ఆస్తులు (జిఎన్‌పిఎ) 3.9 శాతానికి తగ్గి 10 ఏళ్ల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యాయి. గడిచిన ఎనిమిదేళ్లలో బ్యాంక్‌లు రూ.8.6 లక్షల కోట్ల మొండి బాకీలను వసూళ్లు చేశాయి.