హిమాచల్‌లో వర్షం బీభత్సంలో 21 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. హిమాచల్‌లో 24 గంటల వ్యవధిలో 21 మంది మృతి చెందారు. భారీ వర్షాలకు తోడు క్లౌడ్ బరస్ట్ ఘటనల కారణంగా భారీ విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. హిమాచల్ రాజధాని సిమ్లా సహా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 

సిమ్లా సమ్మర్ హిల్ ప్రాంతంలో శివాలయంపై కొండచరియలు జారిపడ్డాయి. శివాలయం ఘటనలో 9 మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీసింది.  ఘటన జరిగిన సమాయంలో ఆలయంలో 25 నుంచి 30 మంది భక్తులు ఉన్నారని అధికారులు తెలిపారు. గుడి శిథిలాల నుంచి ఐదుగురిని కాపాడినట్లు ముఖ్యమంత్రి సుఖవీందర్ సుఖు తెలిపారు.

ఉత్తర భారతదేశంలో నేడు శ్రావణ సోమవారం కావడంతో భక్తులు శివాలయానికి భారీగా తరలివచ్చారు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘సిమ్లాలో శివాలయం కూలిపోయిన బాధాకరమైన వార్తలు వెలువడ్డాయి. ఇప్పటివరకు తొమ్మిది మృతదేహాలను వెలికి తీశారు. స్థానిక యంత్రాంగం శిథిలాలను తొలగించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.” అని ఆయన ఒక ట్వీట్‌లో రాశారు. 

 సిమ్లాలో రెండు ఘటనల్లో 15-20 మంది ఇంకా కొండచరియల కింద చిక్కుకున్నట్టు అంచనా.  సోలన్ జిల్లా కందఘాట్ సమీపంలోని మామ్లిగ్ వద్ద నివాసాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, శిధిలాల కింద మరో ఇద్దరు చిక్కుకున్నారు.

“హిమాచల్‌ప్రదేశ్‌లో గత 48 గంటలుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. బియాస్ నది నీటి మట్టం పెరిగింది. భారీ వర్షాల కారణంగా కొంతమంది మరణించారు. నేను ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లబోతున్నాను. అధికారులందరూ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు” అని సీఎం సుఖ్వీందర్ సింగ్ మీడియాతో చెప్పారు.

కుండపోతగా కురుస్తున్న వర్షాలకు మండి జిల్లాలోని బియాస్‌ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తాజాగా మండి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వరదలు పోటెత్తాయి. సంబల్‌  గ్రామంలో వరద ధాటికి ఏడుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వీడియోను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ట్విట్టర్‌ లో పోస్టు చేశారు.

గత 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి అనేక రహదారులు మూసుకుపోయాయి. ఇప్పటివరకు 700కు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. కీలకమైన సిమ్లా-చండీగఢ్ రహదారిపై కూడా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

వర్షాలు కారణంగా కొండచరియలు విరిగిపడటంతో హమీర్‌పూర్‌లో వ్యవసాయం పంటలు, సారవంతమైన భూములు దెబ్బతిన్నాయి. కాగా స్థానిక వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఆగస్టు 14 నుంచి 17 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

ఇక ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 60 మంది చనిపోయారు. మరో 17 మంది అదృశ్యమయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారులతోపాటు పలు రహదారులను మూసివేశారు. తెహ్రీలోని కుంజపురి బగర్ధర్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో రిషికేశ్-చంబా జాతీయ రహదారిని మూసివేశారు.

 రిషికేశ్-దేవప్రయాగ్-శ్రీనగర్ జాతీయ రహదారులపై సఖ్నిధర్ వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా దాదాపు 1,169 ఇళ్లు, పెద్ద మొత్తంలో వ్యవసాయ భూములు కూడా దెబ్బతిన్నాయి. మరోవైపు డెహ్రాడూన్, చంపావత్‌లలో ఈ రోజు విద్యాసంస్థలన్నింటిని మూసివేయాలని అధికారులు ఆదేశించారు. 

వరదల దృష్ట్యా జిల్లా మేజిస్ట్రేట్‌లు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశించింది.