మూడు కేంద్రాల నుంచి బీజేపీ `విజయ్ సంకల్ప్’ యాత్రలు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, హామీల అమలు కోసం ఒత్తిడి పెంచేందుకు పోరాటాలు ఉధృతం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే నెలలో మూడు కేంద్రాల నుంచి `విజయ్ సంకల్ప్ యాత్రలు చేపట్టనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌(ఆలంపూర్‌), ఉమ్మడి ఖమ్మం(భద్రాచలం) ఉమ్మడి ఆదిలాబాద్‌(బాసర) జిల్లాల నుంచి యాత్రలు ప్రారంభించే అవకాశం ఉంది.

 పార్టీ నేతలు కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటెల రాజేందర్ ఈ యాత్రలకు సారధ్యం వహించే అవకాశం ఉంది.  ఒక్కో కేంద్రం నుంచి ప్రారంభమయ్యే రథయాత్ర ప్రతీ రోజు కనీసం 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో కొనసాగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 17 నుంచి ఈ రథయాత్రలు ప్రారంభించాలా? లేక ఆ రోజున ముగిసేలా చేపట్టాలా? అన్న విషయంలో ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత రానుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

పార్టీ జాతీయ, రాష్ట్ర నేతలు ఈ యాత్రల్లో పాల్గొంటారు. మరోవైపు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనలు చేపట్టనున్నారు. ఈ ఆందోళనల రూపకల్పనకు పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ నేతృత్వంలో సీనియర్‌ నేతలతో కమిటీ ఏర్పాటైంది.

ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ సునీల్‌ బన్సల్‌ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశం సోమవారం కూడా కొనసాగనుంది. తొలి దశలో 30 రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణను సోమవారం ఖరారు చేయనున్నారు. 

ఇందులో భాగంగా దళిత బంధు, బీసీ బంధు, నిరుద్యోగ సమస్య, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు.. వంటి ప్రధాన అంశాలపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టేలా పోరాటాలను రూపొందించనున్నారు. పోరాట కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ ఉంటారు.  సభ్యులుగా మాజీ ఎంపీలు విజయశాంతి, చాడ సురేశ్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కరీంనగర్‌ జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, మాజీ ఎమ్మెల్యే ఎన్‌.వి.ఎస్.ఎస్. ప్రభాకర్‌ తదితర నేతలు కలిపి మొత్తం 14 మంది ఉంటారు.

ఇప్పటికే డబల్ బెడ్ రూమ్ గృహాల నిర్మాణం కోసం కిషన్ రెడ్డి దశలవారీ ఉద్యమం ప్రారంభించారు. ఈ ఉద్యమానికి కొనసాగింపుగా ఈ యాత్రలు జరిగే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేసేందుకు ఈ యాత్రలో దోహదపడే అవకాశం ఉంటుంది.

మరోవంక, ఆగస్టు 13-15 వరకు జరుగుతున్న ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా రాష్త్ర పర్యటన ఈ నెల చివరి వారంలో ఉంటుందని తెలుస్తోంది.