పాక్ తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్ కాకర్

పాకిస్తాన్ తాత్కాలిక ప్రధానమంత్రిగా అన్వర్ ఉల్ హక్ కాకర్ ఎన్నికయ్యారు. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ రద్దు కావడంతో పదవీ విరమణ చేసిన ప్రధాని షెహబాజ్ షరీఫ్, ప్రతిపక్ష నాయకుడు రాజా రియాజ్ శనివారం సమావేశమయ్యారు. తాత్కాలిక ప్రధానిగా ఎవరిని ఎన్నుకోవాలి అన్న దానిపై చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చారు.
 
చిన్న ప్రావిన్స్‌కు చెందిన బలూచిస్థాన్ అవామీ పార్టీ (బీఏపీ) చట్టసభ్యుడు కాకర్‌ను తాత్కాలిక ప్రధానిగా ఎంపిక చేశారు. ఆయన నియామకాన్ని పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదించారు. పాకిస్థాన్‌ ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు శనివారం ప్రకటించింది.
 
కాగా, పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ పదవీ కాలం మూడు రోజుల్లో ముగియనుండటంతో  అసెంబ్లీని రద్దు చేయాలని ప్రధాని షెహబాజ్ షరీఫ్ సిఫార్సు చేశారు. దీంతో ఈ నెల 9న పాక్‌ జాతీయ అసెంబ్లీ రద్దైంది. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం 90 రోజుల్లో సాధారణ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అన్వర్ ఉల్ హక్ కాకర్ తాత్కాలిక ప్రధానిగా వ్యవహరిస్తారు.
 
బెలూచిస్థాన్‌కు చెందిన ఈ సెనెటర్ రాజకీయంగా పెద్దగా తెలిసిన వ్యక్తిగా చలామణి కాలేదు. ఇప్పుడు ఆపద్ధర్మ ప్రధాని అవుతోన్న ఆయన త్వరలోనే కేబినెట్‌ను, నూతన ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. తర్వాత ఎన్నికల నిర్వహణ కూడా ఆయన హయాంలోనే జరగాల్సి ఉంటుంది.