పాకిస్తాన్ , చైనాల నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ సరిహద్దులను మరింత పటిష్టం చేస్తోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్ లోని వ్యూహాత్మక శ్రీనగర్ ఎయిర్‌బేస్ వద్ద అధునాతన మిగ్ 29 యుద్ధ విమానాలను మోహరించింది. ఇప్పటివరకు ఈ ఎయిర్‌బేస్‌లో ‘మిగ్ 21’ స్కాడ్రన్ విధులు నిర్వహించగా, ఇప్పుడు వాటి స్థానంలో మిగ్ 29 యుద్ధ విమానాలను దింపింది.
‘డిఫెండర్ ఆఫ్ ది నార్త్’ గా పిలిచే మిగ్ 29 స్కాడ్రన్ , చైనా, పాక్ నుంచి వచ్చే ముప్పును సమర్థంగా అడ్డుకోగలదని వాయుసేన దళాలు చెబుతున్నాయి. “కశ్మీర్ లోయ మధ్యలో శ్రీనగర్ ఉంటుంది. మైదానాల కంటే ఎత్తులో ఉంటుంది. సరిహద్దులకు సమీపంలో ఉండే ఎయిర్‌బేస్ ల్లో వేగంగా స్పందించే విమానాలను మోహరించడం ఉత్తమం. అవి దీర్ఘశ్రేణి క్షిపణులను మోసుకెళ్లేవైతే మరింత వ్యూహాత్మకంగా ఉంటుంది. మిగ్ 29 కు ఈ సామర్థాలన్నీ ఉన్నాయి. రెండువైపులా ముప్పులను ఇది ఎదుర్కోగలదు” అని భారత వాయుసేన పైలట్ స్కాడ్రన్ లీడర్ విపుల్ శర్మ వెల్లడించారు.
సాధారణంగా సరిహద్దుల్లో శత్రువుల నుంచి ముప్పు ఎదురైనప్పుడు యుద్ధ క్షేత్రాల్లో ఫస్ట్ రెస్పాండర్స్‌గా మిగ్‌లను వినియోగిస్తారు. ఇందుకోసం కశ్మీర్ లోయలో గత కొన్నేళ్లుగా మిగ్ 21లు విధులు నిర్వర్తిస్తున్నాయి. 2019 లో బాలాకోట్ లోని పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేపట్టిన తర్వాత, పాక్ మనపైకి ఎఫ్16తో దూసుకొచ్చింది. అప్పుడు మిగ్ 21 వేగంగా వెళ్లి దాన్ని కూల్చేసిన విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం మిగ్ 21లను దశల వారీగా ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో శ్రీనగర్ ఎయిర్‌బేస్‌లో మిగ్ 29పే మోహరించారు. మిగ్ 21తో పోలిస్తే, మిగ్ 29 లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇవి దీర్ఘశ్రేణి ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు, ఎయిర్‌టుగ్రౌండ్ ఆయుధాలను మోసుకెళ్ల గలవు.
అంతేగాక, వీటిల్లో ఉండే నైట్ విజన్ గాగుల్స్ ఫీచర్‌తో చిమ్మచీకట్లోనూ వీటిని ఉపయోగించే వీలుంటుంది. ఇక గాల్లోనే ఇంధనం నింపే సామర్థ్యం ఉండటంతో సుదీర్ఘ దూరానికి వీటిని పంపించొచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి లోనే వీటిని శ్రీనగర్ ఎయిర్‌బేస్‌కు తరలించగా, తాజాగా విధుల్లోకి మోహరించారు.
More Stories
శ్రీహరికోటలో మూడవ లాంచ్‌ప్యాడ్
వాయనాడ్ విపత్తులో గల్లంతైన వారిని మృతులుగా ప్రకటన
మోదీ, అమిత్ షా ల ఎఐ ఫోటోలు వాడిన ఆప్ పై కేసు