భారత్‌- చైనా సైనిక అధికారుల స్థాయి చర్చలు నేడే

భారత్‌- చైనా సైనిక అధికారుల స్థాయి చర్చలు నేడే

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ దక్షిణాఫ్రికాలో సెప్టెంబర్‌ 9, 10 తేదీల్లో జరిగే ‘బ్రిక్స్‌ సదస్సు’లో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరుదేశాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా భారత్‌- చైనా సైనిక అధికారుల స్థాయి చర్చలు సోమవారంనాడు చుషుల్‌-మోల్డో సరిహద్దులో భారత్‌ వైపు ప్రాంతంలో జరుగనున్నాయి.

ఇప్పటి వరకు 18 సార్లు ఈ అంశంపై సమావేశాలు జరగ్గా  సోమవారం 19వ దఫా చర్చలు జరుగుతాయని అధికారులు తెలిపారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా భారత్‌- చైనా సైనికాధికారుల చర్చలు సాగనున్నాయి. భారత్‌- చైనాల మధ్య 3,488 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. 

అరుణాచల్‌ ప్రదేశ్‌ దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా వాదిస్తుండగా, భారత్‌ మాత్రం దానిని తీవ్రంగా ఖండిస్తోంది. ఇదే ఇరుదేశాల మధ్య ఉన్న ప్రధాన వివాదం. సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతను కాపాడుకోవడం కోసం ఇరుదేశాలు పలుసార్లు చర్చలు జరుపుతూనే వస్తున్నా అవి పూర్తిస్థాయిలో సఫలం కావట్లేదు. 

అలాగే భారత్‌ ఆధీనంలో ఉండే అక్సాయిచిన్‌లోని 34వేల చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. 2020 జూన్‌లో తూర్పు లడఖ్‌ సరిహద్దులోని గల్వాన్‌ లోయలో భారత్‌- చైనా జవాన్ల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఆ దాడుల్లో 20 మంది భారత్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, చైనా మాత్రం తమ సైనికుల మృతుల సంఖ్య వెల్లడించలేదు. 

అప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాలు సైన్యాలను మోహరించాయి. గతంలో జరిగిన చర్చలతో చాలా ప్రాంతాల్లో సైన్యం ఉపసంహరణ ప్రక్రియ ముగిసినా కొన్ని కీలక పాయింట్లు అయిన దెప్పాంగ్‌, దెమ్‌చోక్‌ వంటి ప్రాంతాల విషయంలో బలగాల ఉపసంహరణకు చైనా ససేమిరా అంటోంది.