బిఆర్ఎస్ ఎమ్యెల్యే బాల్క సుమన్ దళిత ద్రోహి

చెన్నూరు నియోజకవర్గంలో దళిత రైతు దుర్గం బాబును టిఆర్ఎస్ నాయకుడు పెడరెక్కలు విరిచి కట్టేసి కొడతే  కనీసం స్పందించకుండా దళితునిపై దాడి చేసిన టిఆర్ఎస్ నాయకుడు రామ్ రెడ్డికి వంత పాడుతున్న స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ దళిత ద్రోహి అని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా తీవ్ర స్థాయిలో విమర్శించారు.

చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం శెట్టిపల్లి గ్రామంలోని  టిఆర్ఎస్ నాయకుడు రామిరెడ్డి పొలంలో దళిత రైతు దుర్గం బాబు పశువు చేను మేసిందని, టిఆర్ఎస్ నాయకుడు దళిత రైతు ఇంటికి వెళ్లి దుర్గం బాబును కొట్టుకుంటూ తీసుకెళ్లి తన పశువుల కొట్టంలోని గుంజకు చేతులు వెనక్కి కట్టేసి పాశవికంగా దాడిచేశారని ఆయన ఆరోపించారు.

 
నోరులేని జీవాలు, తప్పు జరిగింది క్షమించమని వేడుకున్నా కనికరించకుండా కులం పేరుతో దూషిస్తూ మానవత్వం మరిచి దాడి చేసిన బీఆర్ఎస్ నాయకుడిపై అట్రాసిటి కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.  పక్క రాష్ట్రాలలో జరిగే ప్రతి చిన్న సంఘటనకు స్పందించే ఎమ్యెల్యే బాల్క సుమన్ తన సొంత నియోజకవర్గంలో దళిత రైతుపై సొంత పార్టీ నాయకుడు పాశవికంగా దాడి చేస్తే కనీసం స్పందించారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టిఆర్ఎస్ పాలనలో  గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో  ప్రతిరోజు దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, మోసపూరిత హామీలతో దళితులను నిరంతరం మోసం చేస్తున్న దగాకోరు పార్టీ టిఆర్ఎస్ అంటూ ఆయన విమర్శించారు.  తెలంగాణ రాష్ట్రంలో నిరంతరం దళితులపై దాడులు జరుగుతుంటే టిఆర్ఎస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు, మంత్రులు నోరు మూసుకొని కెసిఆర్ ఫామ్ హౌస్ లో బానిసల్లాగా ప్రవర్తించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
రాబోయే ఎన్నికల్లో  తెలంగాణ దళిత సమాజ టిఆర్ఎస్ పార్టీని పొందబెట్టడం ఖాయమని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.  దళిత రైతు దుర్గం బాబుకు న్యాయం జరిగే వరకు బీజేపీ ఆ పేద కుటుంబానికి అండగా ఉంటుందని కొప్పు భాషా  స్పష్టం చేశారు.