పవన్ కల్యాణ్ కు విశాఖ పోలీసుల నోటీసులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం జగదాంబ బహిరంగ సభలో పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, బహిరంగ సభలో నిబంధనలు ఉల్లంఘించారని అభియోగించారు. వారాహి యాత్రలో ఇకపై ఇలా వ్యవహరించకూడదని నోటీసుల్లో పేర్కొన్నారు. విశాఖ తూర్పు ఏసీపీ పవన్ కు నోటీసులు ఇచ్చారు.
 
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని, విద్వేషాలు రగిల్చే వ్యాఖ్యలు చేయరాదని, పోలీసుల నిబంధనలు పాటించాలని, షెడ్యూల్ వివరాలను ముందే ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవంక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రుషికొండ పర్యటనపై విశాఖ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం రుషికొండను పవన్ కల్యాణ్ పరిశీలించనున్నారు. 
 
జోడుగులపాలెం వద్ద నుంచి అందరూ ఆగిపోవాలని, రాడిసన్ బ్లూ హోటల్ వద్ద నుంచి పవన్‌ వాహనాన్ని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. రుషికొండ వద్ద రోడ్డుకు కుడివైపున వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. రుషికొండ వద్ద ఎడమవైపున మాత్రమే వెళ్లాలని పోలీసులు షరతులు పెట్టారు. 
 
పోలీసుల ఆంక్షలపై జనసైనికులు మండిపడుతున్నారు. రుషికొండ ఏమైనా నిషేధిత ప్రాంతమా? అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ రుషికొండ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేయకూడదని, కావలంటే గీతం యూనివర్సిటీ వద్దకు వెళ్లి మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చని పోలీసులు నిబంధనలు పెట్టారు. 
 
పోలీసుల తీరు భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వచ్చాయని జనసేన న్యాయవాదులు చెబుతున్నారు.

రుషికొండపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని జనసేన నేతలు అంటున్నారు. పవన్ కల్యాణ్ కచ్చితంగా రుషికొండకు వెళ్తారని, అడ్డుకోవాలనుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. రుషికొండ పబ్లిక్ ల్యాండ్ అని, అక్కడకు ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు. 

పవన్ రుషికొండకు వెళ్లేందుకు జనసేన నేతలు పోలీసుల అనుమతి కోరగా, అందుకు పోలీసులు నిరాకరించారు. రుషికొండపై సీఎం కార్యాలయం నిర్మిస్తున్నారని, అక్కడకు బయటి వారిని అనుమతించమని చెబుతున్నారు పోలీసులు. దీంతో జనసేన నేతలు పవన్ కల్యాణ్ తో ఈ విషయం తెలియజేసి, ఆయనతో చర్చలు జరుపుతున్నారు.

పవన్ కల్యాణ్ గత పర్యటనలోనూ పోలీసులు ఆంక్షలు విధించి, నోవోటెల్ హోటల్ నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. తాజాగా ఆయన రుషికొండకు వెళ్లేందుకు పోలీసుల అనుమతి కోరగా, అందుకు పోలీసులు నిరాకరించారు. ఒకవేళ పవన్ హోటల్ నుంచి బయటకు వస్తే అడ్డుకునేందుకు భారీగా పోలీసును మోహరించారు. దీంతో హోటల్ వద్ద జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.