మదనపల్లిలోదిగొస్తున్న టమోటా ధరలు

నిన్నటి వరకూ కొండెక్కి కూర్చొన్న టమాటా ధరలు దిగుబడి పెరగడంతో తగ్గుతున్నాయి. మదనపల్లె మార్కెట్ లో గత నాలుగైదు రోజులుగా టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం మార్కెట్ కు 400 టన్నుల టమాటా వచ్చింది.  దీంతో ఏ గ్రేడ్ టమాటాలు కిలో రూ.30-40 మధ్య పలికింది. బీ గ్రేడ్ టమాటాలు కిలో రూ.21-28 మధ్య పలికాయి.
సగటున రూ.26 నుంచి రూ.37 వరకు టమాటాలను వ్యాపారాలు కొనుగోలు చేస్తున్నారని మార్కెట్ యార్డు అధికారులు తెలిపారు. గురువారం మదనపల్లె మార్కెట్ కు 300 టన్నుల టమాటా సరుకు వచ్చింది. దీంతో ఏ గ్రేడ్ కిలో రూ.50-64 మధ్య, బీ గ్రేడ్ టమాటా ధర కిలో రూ.36-48 వరకు పలికింది. అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలో టమాటా దిగుబడులు పెరగడంతో టమాటా ధరలు తగ్గాయని అధికారులు తెలిపారు.
 
ఇటీవల టమాటా ధరలు అమాంతం పెరిగిపోయాయి. కిలో టమాటాల ధర రూ.200కు పైనే పలికింది. దీంతో చాలా మంది టమాటా రైతులు కోటీశ్వరులు అయ్యారు. కానీ వినియోగదారులు మాత్రం టమాటాలను కొనడమే మానేశారు. తాజాగా టమాటా ధరలు తగ్గుతుండడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. 
 
టమాటా ధరలు భారీగా పెరుగుతుండడంతో మదనపల్లెకు చెందిన చాలా మంది రైతులు టమాటా పంటను సాగు చేశారు. దీంతో పంట దిగుబడి బాగా వచ్చింది. టమాటా సాగు పెరగడంతో మార్కెట్ లో టమాటా ధర పడిపోయింది. పది రోజుల క్రితం కిలో టమాటా రూ. 200 వరకు ఉండగా, శుక్రవారం రోజు రూ.30 వరకు పడిపోయింది. మార్కెట్ లో బయ్యర్లు లేకపోవడంతో డిమాండ్ అమాంతం తగ్గింది.

మదనపల్లె మార్కెట్లో గత నెలలో డబుల్ సెంచరీ కొట్టిన టమాటా ఇప్పుడు కనిష్ఠ ధర రూ.30కు పడిపోయింది. ఆగస్టు 4న కిలో టమాటా గరిష్ఠ ధర రూ.136 కాగా, కనిష్ఠ ధర రూ.100 పలికింది. ఆగస్టు 5న కిలో టమాటా గరిష్ఠ ధర రూ.100, కనిష్ఠంగా రూ.76కు చేరుకుంది. ఆరో తేదీన గరిష్ఠ ధర రూ.116 కాగా, కనిష్ఠ ధర రూ.90గా ఉంది. 

ఆరోజు 404 మెట్రిక్ టన్నుల టమాటా మదనపల్లె మార్కెట్ కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 7వ తేదీన కిలో టమాటా ధర గరిష్ఠంగా రూ.112 కాగా, కనిష్ఠ ధర రూ.88గా ఉంది. క్రమంగా తగ్గుతూ వచ్చిన టమాటా ధరలు 10న అమాంతం పడిపోయాయి. నిన్న గరిష్ఠ ధర రూ.64 కాగా కనిష్టంగా రూ.36కు చేరింది. ఇక ఈ రోజు మరింత తగ్గి గరిష్ఠంగా రూ.40, కనిష్ఠంగా రూ.30 పలికింది.