వీఆర్‌ఏల విలీనంపై కేసీఆర్ కు ఎదురుదెబ్బ

వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జూనియర్‌ అసిస్టెంట్‌లుగా నియమించే విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వంలో వీఆర్‌ఏలను విలీనం చేసేందుకు ఇచ్చిన జీవోలు 81, 85లను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు గురువారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ జీవో 81 జారీ చేసిన జూలై 24కు ముందు ఉన్న స్థితిని యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది.

తద్వారా ఇప్పటికే వివిధ శాఖల్లో చేరిన వీఆర్‌ఏల నియామక ఉత్తర్వులు చెల్లవని స్పష్టం చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వుల ద్వారా వారి చేరికలను రివర్స్‌ చేసింది.  ఈ వ్యవహారంలో దాఖలైన మూడు పిటిషన్లపై జస్టిస్‌ మాధవీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ కేసులో రెవెన్యూ మంత్రి హోదాలో సీఎం కేసీఆర్‌, కేంద్ర ఎన్నికల సంఘం ప్రతివాదులుగా ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. దీంతో వారిని ప్రతివాదుల జాబితాలో నుంచి తొలగించేందుకు పిటిషనర్లు అంగీకరించారు. 

సీసీఎల్‌ఏ నవీన్‌ మిత్తల్‌ను ప్రతివాదిగా తొలగించేందుకు పిటిషనర్లు అంగీకరించలేదు. దీంతో ఆయన వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా ఉండాలా? లేదా? అన్న అంశంపై తామే నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. అసలు జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఉండాల్సిన అర్హతలు ఏమిటి? వారి ఎంపిక ప్రక్రియ ఏమిటి? రెగ్యులర్‌ నోటిఫికేషన్‌ ఇస్తే ఉండాల్సిన అర్హతలు లేని వారిని తమ హోదా కంటే పెద్ద హోదా కలిగిన పోస్టులోకి ఎలా తీసుకుంటారు?

జూనియర్‌ అసిస్టెంట్‌కు సమానస్థాయి కలిగిన వీఆర్వోలను ఆ పోస్టుల్లోకి ఎందుకు తీసుకోలేదు?  వీఆర్‌ఏలు-వీఆర్వోలకు మధ్య ఎందుకు వివక్ష చూపుతున్నారు? పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టానికి విరుద్ధంగా మీకు నచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తారా? రెవెన్యూ శాఖలో ఖాళీలు లేవని చెప్పారు. ఇప్పుడు 50 శాతం వీఆర్‌ఏలను రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేస్తున్నారు. వీఆర్‌ఏల నుంచి డిమాండ్‌ ఉందని చెప్తున్నారు. 

మరి అదే వీఆర్‌ఏల్లో అన్యాయం జరుగుతున్న వారి సమస్యలను పట్టించుకోరా? డిమాండ్‌ చేయకుండా ఉన్న వారికి అన్యాయం చేస్తారా? విలీన ప్రక్రియకు ముందు అభ్యంతరాలు స్వీకరించారా? విధాన నిర్ణయం అయినంత మాత్రాన కసరత్తు లేకుండా విలీన ప్రక్రియ చేపడతారా? అని ప్రశ్నించింది. 

వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో సర్దుబాటు చేసే జీవోలు, ప్రొసీడింగ్స్‌ నిబంధనల ప్రకారం లేవని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన ధర్మాసనం వాటిని సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వీఆర్‌ఏల సర్దుబాటు వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.