భారీ భూకంపంతో వణికిపోయిన జపాన్​, టర్కీ

జపాన్​, టర్కీలలో భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని హొక్కైడో ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల 44 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టార్​ స్కేల్​పై దీని తీవ్రత 6.0గా నమోదైంది. ఈ విషయాన్ని జర్మన్​ జియోసైన్స్​ రీసెర్చ్​ సెంటర్​ వెల్లడించింది.

భూమికి 46 కి.మీల దిగువన భూ ప్రకంపనలు నమోదయ్యాయి. కాగా జపాన్ భూకంపం ​ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టం సంభవించలేదు. భూకంపం కారణంగా ప్రజలు భయపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. జపాన్​లో తరచుగా భూకంపాలు నమోదవుతూ ఉంటాయి. ప్రజలు నిత్యం భయంతో జీవిస్తుంటారు.

మరోవైపు టర్కీలోనూ భూకంపం సంభవించింది. యూరోపియన్​ మెడిటరేనియన్​ సీస్మొలాజికల్​ సెంటర్​ ప్రకారం మలత్యా ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల 48 నిమిషాలకు భూమి కంపించింది. భూమికి 10 కి.మీల దిగువన భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టార్​ స్కేల్​పై భూకంపం తీవ్రత 5.3గా నమోదైంది.

“మలత్యాకు 10కి.మీల దూరంలో భూకంపం నమోదైంది. పలు భవనాలు ఊగిపోయాయి. ఆస్థి, ప్రాణ నష్టం జరిగినట్టు తెలుస్తోంది,” అని అధికారులు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం టర్కీ భూకంపంలో 23మంది ప్రజలు గాయపడ్డారు. చాలా మంది ప్రాణాలు కాపాడుకోవడానికి భవనాల నుంచి బయటకు దూకేశారు. పలు భవనాలు దెబ్బతిన్నాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో సంభవించిన భారీ భూకంపం నుంచి టర్కీ ఇంకా కోలుకోలేదు. ఫిబ్రవరిలో దాదాపు 4,5 భూకంపాలు ప్రజలను భయపెట్టాయి. అనేక భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. వేర్వేరు ఘటనల్లో మృతుల సంఖ్య దాదాపు 50 వేలుగా నమోదైంది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం

కాగా, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మరోసారి భూకంపం వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 2.56 గంటలకు పోర్టుబ్లేయిర్‌ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. పోర్టుబ్లేయిర్‌కు112 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. 
 
భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు పేర్కొంది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.  ఈ నెల 2వ తేదీ నుంచి అండమాన్‌ దీవుల్లో భూమి కంపించడం ఇది మూడోసారి. గత గురువారం (ఆగస్టు 3) తెల్లవారుజామున 4.17 గంటలకు 43. తీవ్రతతో భూమి కంపించినట్లు ఎన్‌సీఎస్‌ తెలిపింది. అదేవిధంగా ఈ నెల 2న తెల్లవారుజామున 5.40 గంటలకు 5.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇక జూలై 29న కూడా 5.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.