
అంగళ్లులో తనను చంపాలని చూశారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నానికి పోలీసులు కూడా సహకరించారని ఆయన ఆరోపించారు. విజయనగరంలో మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ “మమ్మల్ని చంపి రాజకీయాలు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. అంగళ్లు అల్లర్లపై సీబీఐతో విచారణ జరిపించాలి. నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నది ఎవరో విచారణలో తేలాలి” అని డిమాండ్ చేశారు.
అంగళ్లులో విధ్వంసం జరగబోతుందని పోలీసులకు ముందస్తు సమాచారం ఉందని చెబుతూ తనను హత్య చేయాలనే వైసీపీ గూండాలు వచ్చారని స్పష్టం చేశారు. కమెండోలు పలు సార్లు తన ప్రాణాలు కాపాడారని చెబుతూ పుంగనూరులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్లు మీదకు రావలసిన అవసరమేంటని ప్రశ్నించారు.
టీడీపీ కేడర్‌పైనా దాడులు చేస్తున్నారని, పైగా ఇప్పుడు తనపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్థ నాయకుడు ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలు ఇలాన ఉంటాయని ధ్వజమెత్తారు. ‘‘తంబళ్లపల్లి, అంగళ్లులో నాపై హత్యాయత్నం చేశారు. కానీ ఇప్పుడు నాపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. ఇలాంటిది ఎక్కడా చూడలేదు. సైకో ముఖ్యమంత్రి ఆదేశాలతోనే నన్ను తిరగనివ్వడంలేదు. ప్రజల తరఫున పోరాడకుండా అడ్డుకుంటున్నారు” అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
ఒక పథకం ప్రకారం తనను అడ్డుకుని, హత్య చేయడానికి ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. ఎక్కడికెళ్లినా తనపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘నేను పారిపోవాలా? ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న నేనే పారిపోతే ఇక అర్థమేముంది? వైసీపీ ప్రభుత్వం చేసే దోపీడీని, అవినీతిని నేను ఎదుర్కొని తీరుతాను” అని తేల్చి చెప్పారు.
చంద్రబాబుతో పాటు 20 మంది టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేటీ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో జరిగిన ఘటనల నేపథ్యంలో కురబలకోట మండలం ముదివీడు పోలీస్‌స్టేషన్‌లో చంద్రబాబుపై కేసు నమోదైంది.
ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డిని పేర్కొన్నారు. వారితో పాటు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, దమ్మాలపాటి రమేశ్, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా 20 మందిపై కేసు పెట్టారు. ఇదే కేసులో ఇతరులు కూడా పాల్గొన్నారంటూ పలువురు టీడపీ నేతలపై సైతం కేసు నమోదు చేశారు.
వైసీపీ నాయకుడు ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అంగళ్లులో అల్లర్లు పథకం ప్రకారమే జరిగాయని జిల్లా యస్పీ గంగాధర్ రావు చెప్పారు. అంగళ్ళు అల్లర్ల ఘటనలో పలువురికి గాయాలయ్యాయని, టిడిపి కార్యకర్తలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెచ్చగొట్టారని వివరించారు. బాధితుల ఫిర్యాదు తో చంద్రబాబు నాయుడుతోసహ 19 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
More Stories
సామరస్యపూర్వక, వ్యవస్థీకృత హిందూ సమాజ నిర్మాణం
మహారాణి అబ్బక్కకు ఆర్ఎస్ఎస్ ఘనంగా నివాళులు
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి