పంచాయితీ నిధుల కోసం 10న బీజేపీ కలెక్టరేట్ల ముట్టడి

 
నిధుల కోసం సర్పంచులు చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలకు ఏపీ బీజేపీ మద్దతు ప్రకటించింది. సర్పంచ్‌ల హక్కుల సాధన కోసం పోరుబాట పడుతున్నామని బిజెపి రాస్గ్త్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురందేశ్వరి ప్రకటించారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ ల వద్ద ఆందోళన కార్యక్రమాలకు పురందేశ్వరి పిలుపు నిచ్చారు.
పంచాయితీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా స్వాహా చేస్తే గ్రామాలు ఎలా అభివృద్ది చెందుతాయని ఆమె ప్రశ్నిస్తున్నారు. గ్రామ స్వరాజ్యం రావాలని కేంద్రం నేరుగా గ్రామ పంచాయితీలకు నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులకు మోకాలొడ్డుతోందని ఆరోపించారు.  రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల గ్రామ పంచాయితీల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్ధితిలు ఏర్పడుతున్నాయని రాష్ట్రవ్యాప్త పర్యటనలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఎండగట్టారు.
ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు ఆమె కసరత్తు పూర్తి చేసారు.  ఇప్పటికే రాష్ట్ర నేతలు, కోర్ కమిటీ సభ్యలుతో ఆడియో, వీడియో కాన్ఫెరెన్సులు నిర్వహించారు. జోన్ల వారీగా అంటే రాష్ట్రాన్ని నాలుగు జోన్ లు గా విభజించి ఆడియో కాన్పెరెన్సులు నిర్వహించారు.  జిల్లా కేంద్రాల్లో జరిగే ఆందోళనలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు గ్రామ పంచాయితీల్లో నిధులు స్వాహా చేస్తు ఒక రకమైన ఆర్థిక నేరానికి రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ల విషయంలో వ్యవహరిస్తున్న విషయాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి బిజెపి రాష్ట్ర వ్యాప్త ఉధ్యమానికి శ్రీకారం చుట్టింది.
జిల్లా పార్టీ నేతలు మండల స్ధాయిలో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించి ఈ నెల 10 వ తేదీన నిర్వహించే ఆందోళన కార్యక్రమం విజయ వంతం చేసేందుకు కార్యక్రమాన్ని రూపొందించారు. ఈనెల 10 వ తేదీన జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ఆందోళనలకు వక్తలను పురందేశ్వరి ప్రకటించారు.  రాష్ట్ర నేతలు అందరూ జిల్లా కేంద్రాలలో నిర్వహించే ఉద్యమాల్లో పాల్గొనే విధంగా ఆమె ప్రణాళిక రూపొందించారు.
ఈనెల 10వ తేదీన జరిగే కలెక్టరేట్ ఆందోళనల్లో ఒంగోలు జిల్లాలో జరిగే కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పాల్గొంటారు. విజయవాడలో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, అరకులో మాజీ ఎంపి కొత్తపల్లి గీత, విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖపట్నంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, అనకాపల్లిలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు, కాకినాడలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు ఆందోళనలకు నేతృత్వం వహిస్తారు.
రాజమహేంద్రవరంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మచిలీపట్నంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుసాంబశివరావు, గుంటూరులో మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, నెల్లూరులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, తిరుపతిలొ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొంటారు. కడపలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, హిందుపూర్ లో ఎపి సహ ఇంఛార్జి సునీల్ దేవదర్, కర్నూలు లో మాజీ ఎంపి టిజి వెంకటేష్, నంద్యాల లో మాజీ ఎమ్మెల్యే ఎం ఎస్ పార్ధసారధి హాజరు కానున్నారు. ప్రతి జిల్లా కేంద్రానికి ఒక ప్రముఖ సీనియర్ బిజెపి నేతలు హాజరయ్యే విధంగా  ఆమె కార్యక్రమాన్ని రూపొందించారు.