పంచదార ఎగుమతులపై కూడా నిషేధం అవకాశం

దేశీయంగా పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు, వర్షపాతం ఆలస్యమైనందున ఖరీఫ్‌ దిగుబడులపై ప్రభావం పడుతుందన్న అంచనాతో ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. తాజాగా పంచదార ఎగుమతులపై కూడా నిషేధం విధించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
ఈ సీజన్‌లో చెరకు సాగు భారీగా తగ్గుతుందని, దానితో అక్టోబర్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్‌లో పంచదార ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందన్న అంచనాలు ఉన్నాయి. గత సంవత్సరం కూడా అంచనాల కంటే తక్కువగానే పంచాదార ఉత్పత్తి జరిగింది.  చాలా దేశాలు మన దేశం నుంచి పంచదారను దిగుమతి చేసుకుంటున్నాయి. నిషేధం విధిస్తే ఆయా దేశాల్లో చక్కెర ధరలకు రెక్కలు వస్తాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 
దేశంలో నెలకొన్న పరిస్థితుల మూలంగా మన దేశం పూర్తి స్థాయిలో చక్కెరను ఎగుమతి చేసే పరిస్థితి ఉండదని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం ఇప్పటికే నాన్‌ బాస్మతి రకాల బియ్యం ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. అంతకు ముందే ప్రభుత్వం గోధుమలు, గోధమ పిండి ఎగుమతులపై కూడా నిషేధం విధించింది. 
 
వాతావరణ పరిస్థితులకు తోడు రష్యా, ఉక్రెయిన్‌ మధ్య రోజు రోజుకు ఉద్రికత్తలు ఇంకా పెరగడం కూడా ఆందోళన కలిగిస్తున్న అంశమని, ఈ సంక్షోభం మరింత ముదిరితే దాని ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. దేశంలో చెరకు పండించే ప్రధాన రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర్‌లో జూన్‌లో సరైన వర్షాలు పడలేదు. దీని వల్ల చెరకు సాగుపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. గత ఏడాది వచ్చిన 31.7 మిలియన్‌ టన్నుల ఉత్పత్తితో పోల్చితే ఈ సారి ఉత్పత్తి 3.4 శాతం తగ్గుతుందని ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఆదిత్య జున్‌జున్‌వాలా అంచనా వేశారు. దేశీయ డిమాండ్‌ను ఇది తీర్చగలదని ఆయన చెప్పారు.

మరో వైపు ప్రభుత్వం జీవ ఇంధనం ఇథనాల్‌ను తయారు చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టింది. దీని ఫలితంగా ఈ సారి మరింత ఎక్కువ చక్కెరను ఇథనాల్‌ ఉత్పత్తికి వినియోగించనున్నారు. షుగర్‌మిల్లులు ఈ సారి 4.5 మిలియన్‌ టన్నుల చక్కెరను ఇథనాల్‌ ఉత్పత్తి కోసం కేటాయించారు. ఇది గత సంవత్సరంలో పోల్చితే 9.8 శాతం ఎక్కువ. 

ఇథనాల్‌ ఉత్పత్తికి మరింతగా చక్కెరను ఉపయోగిస్తే, భారత్‌ వీటి ఎగుమతులకు అనుమతి ఇవ్వకపోవచ్చని స్టోన్‌ ఎక్స్‌లో చక్కెర, ఇథనాల్‌ హెడ్‌ బ్రూనోలిమా అభిప్రాయపడ్డారు. అయితే, ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎంఏ) వేసిన అంచనాలను ఫుడ్‌ సెక్రటరీ సంజయ్‌ చోప్పా త్రోసిపుచ్చారు. మన దేశం 2022-23 సీజన్‌లో చక్కెర ఎగుమతులను అంతకు ముందు జరిగిన 11 మిలియన్‌ టన్నుల నుంచి 6.1 మిలియన్‌ టన్నులకు పరిమితం చేసింది. 

ఈ సారి సీజన్‌లో ఇది మరింత తగ్గి 2 లేదా మూడు మిలియన్‌ టన్నులకే ఎగుమతులను పరిమితం చేయవచ్చని, లేదా పూర్తిగా ఎగుమతులను నిషేధించవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే గ్లోబర్‌ షుగర్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

జులైలో చాలా ప్రాంతాల్లో మంచి వర్షపాతం పడినందున కొంత మేర ప్రయోజనం కలగనుందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అక్టోబర్‌లో కొత్త పంట వచ్చి చక్కెర ఉత్పత్తి సీజన్‌ ప్రారంభమవుతుంది. అయితే ప్రభుత్వం చెరకు సాగుపై పూర్తి వివరాలు వెల్లడైన తరువాతే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.