పాక్ లో ఘోర రైలు ప్రమాదం.. 30 మంది మృతి

పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సింధ్ రాష్ట్రంలో హజారా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 30 మంది మరణించారు. 80 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. నవాబ్షా నగరంలోని సహారా రైల్వే స్టేషన్కు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ పాకిస్థాన్ రైలు ప్రమాదం ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

ప్రమాదంలో 10 బోగీలు పట్టాలు తప్పినట్టు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి పరుగులు తీసి సహాయక చర్యలను చేపట్టారు. 20 మృతదేహాలను వెలికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

“ఇది చాలా పెద్ద ప్రమాదం. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టాము. 30 మంది మరణించారు. 50 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు,” అని రైల్వేశాఖ మంత్రి ఖవాజా సాద్ రఫీక్ మీడియాకు వివరించారు. ఘటనాస్థలానికి మరిన్ని సహాయక బృందాలను పంపిస్తున్నట్టు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పాకిస్థాన్ ఆర్మీ కూడా సాయం చేస్తోందని సమాచారం.

కరాచీ నుంచి అబాటాబాద్కు వెళుతుండగా సహారా రైల్వే స్టేషన్కు సమీపంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. స్థానికులు సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రయాణికులను కాపాడేందుకు రైలు అద్దాలను పగలగొడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి.

“ట్రైన్కు మొత్తం 17 బోగీలు ఉన్నాయి. ఎకానమీ క్లాస్లో 950మంది ప్రయాణికులు, ఏసీ బోగీలో 72 మంది ప్రయాణికుల కెపాసిటీ ఉంది. 17 బోగీల్లో 10 పట్టాలు తప్పాయి,” అని అధికారులు తెలిపారు. కాగా,  రైల్వే లైన్ను పునరుద్ధరించేందుకు కనీసం 18 గంటల సమయం పడుతుందని అంచనా వేశారు. పాకిస్థాన్లో రైలు ప్రమాదాలు తరచూ భయపెడుతుంటాయి. రైల్వే వ్యవస్థలో లోపాలు ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.