రాహుల్​ గాంధీ ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణ!

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్​సభ సెక్రటేరియట్​ సోమవారం ఉదయం ఓ ప్రకటన విడుదల చేసింది. మోదీ ఇంటి పేరు వివాదంలో గాంధీకి పడిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో లోక్​సభ సెక్రటేరియట్​ ఈ నిర్ణయం తీసుకుంది.  తాజా పరిణామాలతో రాహుల్​ గాంధీ వయనాడ్​ ఎంపీగా కొనసాగనున్నారు.

అదే సమయంలో పార్లమెంట్​లో కూడా అడుగుపెట్టనున్నారు.  “దొంగలందరికి మోదీ ఇంటి పేరే ఎందుకు ఉంటుంది?” అని 2019 ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇందుకు సంబంధించిన కేసుపై గుజరాత్​లోని ఓ కోర్టు ఈ ఏడాది మార్చ్​లో సంచలన తీర్పును ప్రకటించింది.

రాహుల్​ గాంధీని దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ మార్చి 23, 2023న గుజరాత్ కోర్ట్ తీర్పునిచ్చింది.  ఆ మరుసటి రోజు మార్చి 24, 2023న రాహుల్‌పై అనర్హతవేటుపడింది.  ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని నిబంధనల ప్రకారం పార్లమెంట్ సెక్రటేరియేట్ ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చట్టసభ్యుడికి 2, అంత కన్నా ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడితే సదరు వ్యక్తి ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోతారు.

రాహుల్​ గాంధీ వ్యవహారంలో అన్ని చకచకా జరిగిపోయాయి.  జైలు శిక్షపై స్టే కోసం రాహుల్‌ గాంధీ ట్రయల్‌ కోర్టుతోపాటు గుజరాత్‌ హైకోర్టుకు వెళ్లారు. ఫలితం లేకపోవడంతో చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం ఊరట ఇచ్చింది. రాహుల్ గాంధీకి విధించిన జైలు శిక్షపై స్టే విధించడంతోపాటు ఎంపీ హోదాను పునరుద్ధరించింది.

ఈ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  కోర్టు తీర్పుతో రాహుల్‌ తాజాగా తన ఎంపీ సభ్యత్వాన్ని తిరిగి పొందగలిగారు. ఆ మేరకు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  కోర్టు తీర్పుతో రాహుల్‌ తాజాగా తన ఎంపీ సభ్యత్వాన్ని తిరిగి పొందగలిగారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో రాహుల్‌ పాల్గొననున్నారు.