మ‌ణిపూర్ హింస వెనుక ఆల్‌ఖ‌యిదా హస్తం!

మ‌ణిపూర్‌లో జ‌రుగుతున్న హింస‌తో ఆల్‌ఖ‌యిదా ఉగ్ర సంస్థ‌కు లింకు ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆల్‌ఖ‌యిదాకు చెందిన భార‌తీయ బ్రాంచ్‌ ఈ నేప‌థ్యంలో మోదీ స‌ర్కార్‌కు బెదిరింపులు కూడా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. కుక్కీకి చెందిన ఇద్ద‌రు మ‌హిళ‌ల్ని న‌గ్నంగా ఊరేగించిన ఘ‌ట‌న నేప‌థ్యంలో ఏక్యూఐఎస్‌ (ఆల్ ఖ‌యిదా ఇన్ ఇండియ‌న్ స‌బ్‌కాంటినెంట్‌) కేంద్ర ప్ర‌భుత్వానికి హెచ్చరిక చేసింది. 
 
భార‌త్‌లో జ‌రుగుతున్న మాన‌వ‌హ‌క్కుల ఉల్లంఘ‌న గురించి కూడా ఆ గ్రూపు చ‌ర్చించింది. ఇక ఈ అంశంపై భారత్ కు మ‌ద్ద‌తు ఇస్తున్న అమెరికా శైలిని ఆల్ ఖ‌యిదా ఖండించిన‌ట్లు ఓ ఆంగ్ల ప‌త్రిక‌లో వ‌చ్చిన రిపోర్టు తెలిపింది.  ఉర్దూ మ్యాగిజైన్ ‘న‌వా యే ఘ‌జావ‌త్ హింద్’ అనే ప‌త్రిక‌లో ఏక్యూఐఎస్ త‌న హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. 
 
మోదీ పాల‌న‌లో ముస్లింలు, క్రైస్త‌వులకు భ‌ద్ర‌త క‌రువైంద‌ని, ఆ మైనార్టీల‌కు స‌రైన భ‌ద్ర‌త క‌ల్పించ‌డం లేద‌ని ఏక్యూఐఎస్ ఆరోపించింది. మ‌ణిపూర్ లాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా భారత్ కు మద్దతు ఇస్తున్న అమెరికా స‌ర్కార్‌ను కూడా ఏక్యూఐఎస్ త‌ప్పుప‌ట్టింది. కుక్కీ క్రైస్త‌వుల‌పై హిందుత్వవాదులు దాడులు చేస్తున్న‌ట్లు ఆ ఉగ్ర సంస్థ ఆరోపించింది.స్థానికంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌కు ఆల్‌ఖ‌యిదా ఉగ్ర సంస్థ ఊతం ఇస్తున్న‌ట్లు అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌ణిపూర్ వ‌ర్గ హింస‌పై భారత్ ను టార్గెట్ చేస్తూ ఓ ఉగ్ర సంస్థ మాట్లాడ‌డం కూడా ఇదే మొద‌టి సారి. ఏక్యూఐఎస్ విద్వేషాలు, హింస‌ను రెచ్చగొట్టేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  అయితే మ‌ణిపూర్ హింస వెనుక ప్ర‌త్య‌క్షంగా ఆల్‌ఖ‌యిదా పాత్ర ఉన్న‌ట్లు భావిస్తున్నారు. 

కుక్కీ నార్కో ఉగ్ర‌వాదుల‌కు ఆల్‌ఖ‌యిదా స‌హ‌కారం అందిస్తున్న‌ట్లు ఓ రిపోర్టులో తేలింది. గంజాయి సాగు పెర‌గ‌డం, రోహింగ్యా ముస్లింల‌కు ప్ర‌త్యేక రాష్ట్రం ఇవ్వాల‌న్న ల‌క్ష్యంతో అక్క‌డ ఆల్‌ఖ‌యిదా కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. కుక్కీ నార్కో టెర్ర‌రిస్టుల‌కు ఆల్‌ఖ‌యిదా మ‌ద్ద‌తు ఇవ్వ‌డం వ‌ల్ల యావ‌త్ ఈశాన్య రాష్ట్రాల్లో భ‌ద్ర‌తా స‌మ‌స్య‌లు ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంది.

`సుప్రీం’ విచారణకు హాజరైన మణిపూర్ డిజిపి

మరోవంక, సుప్రీంకోర్టు జారీ చేసిన‌ స‌మ‌న్ల మేర‌కు మ‌ణిపూర్ డీజీపీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. డీజీపీ రాజీవ్ సింగ్ సోమవారం మ‌ధ్యాహ్నం సుప్రీంకోర్టుకు వెళ్లారు. మ‌ణిపూర్‌లో జ‌రుగుతున్న హింస‌పై జిల్లా స్థాయిలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాల‌తో విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు సుప్రీంకు కేంద్రం వెల్ల‌డించింది. సీజేఐ డీవై చంద్ర‌చూడ్ వేసిన ప్ర‌శ్న‌ల‌కు డీజీపీ రాజీవ్ సింగ్ సమాధానం ఇచ్చారు. 

మ‌హిళ‌ల‌పై జ‌రిగిన నేరాల‌కు సంబంధించిన కేసుల్లో ఒక‌వేళ 11 క‌న్నా ఎక్కువ సంఖ్య‌లో ఎఫ్ఐఆర్‌లు న‌మోదు అయి ఉంటే, అప్పుడు జిల్లా స్థాయిలో ఎస్పీ ర్యాంక్ ఆఫీస‌ర్‌తో విచార‌ణ జ‌రిపించ‌నున్న‌ట్లు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా కోర్టుకు తెలిపారు.  మ‌ణిపూర్‌లో గ‌త కొన్ని నెల‌ల నుంచి రెండు వ‌ర్గాల మ‌ధ్య హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్న విష‌యం తెలిసిందే.

 ఇద్ద‌రు మ‌హిళ‌ల్ని న‌గ్నంగా ఊరేగించిన వీడియో కూడా దేశ‌వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఇక పార్ల‌మెంట్‌లోనూ మ‌ణిపూర్ అంశంపై చ‌ర్చించాల‌ని విప‌క్షాలు ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌ణిపూర్ లో జ‌రుగుతున్న సీబీఐ ద‌ర్యాప్తుల‌ను ప‌ర్య‌వేక్ష‌ణ‌ చేయ‌నున్న‌ట్లు సుప్రీంకోర్టు చెప్పింది. జ‌స్టిస్ గీతా మిట్ట‌ల్ నేతృత్వంలో ఓ క‌మిటీని ఏర్పాటు చేయ‌నున్నారు. మాజీ జ‌డ్జీలు జ‌స్టిస్ షాలినీ జోషీ, జ‌స్టిస్ ఆషా మీన‌న్ ఆ క‌మిటీలో ఉన్నారు.