తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ గమ్యస్థానంగా భారత్

భారతదేశం ప్రపంచంలో తక్కువ ఖర్చుతో కూడుకున్న ఆరోగ్య సంరక్షణ గమ్యస్థానంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని  కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి డా. జితేందర్ సింగ్ తెలిపారు. భారతదేశం ఇప్పటికే ప్రివెంటివ్ హెల్త్‌కేర్ మరియు ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ రంగాలలో ముందంజలో ఉందని కూడా ఆయన చెప్పారు.
 
జమ్మూలో శ్రీ మాతా వైష్ణో దేవి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహించిన ఇండియన్ అకాడమీ ఆఫ్ ఒటోరినోలారిన్జాలజీ హెడ్ & నెక్ సర్జరీ వార్షిక సదస్సును ప్రారంభిస్తూ  ఆయుష్మాన్ భారత్ ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకమని చెప్పారు. 
 
అప్పటికే ఉన్న వ్యాధికి కూడా బీమా రక్షణను పొందే అవకాశాన్ని అందించే ఏకైక ఆరోగ్య బీమా పథకం బహుశా ప్రపంచంలోనే ఇదే మొదటిదని చెప్పారు. ఒక వ్యక్తికి క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించినట్లయితే అతను వెళ్లి చికిత్స కోసం ఆర్థిక సహాయాన్ని పొందేందుకు స్వయంగా బీమా చేయించుకోవచ్చని పేర్కొంటూ అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఈ విధానం ఎక్కడా కనిపించదని తెలిపారు.
 
గతంలో భారతదేశం ఎటువంటి నివారణ ఆరోగ్య సంరక్షణకు ప్రసిద్ది చెందలేదని, కానీ ఇప్పుడు భారతదేశం డిఎన్‌ఏ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిన ప్రపంచ వ్యాక్సినేషన్ హబ్‌గా గుర్తించబడిందని  గుర్తు చేసారు.  అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రా నాసల్ కోవిడ్ వ్యాక్సిన్, గర్భాశయ క్యాన్సర్ నివారణకు దేశీయంగా అభివృద్ధి చేయబడిన వ్యాక్సిన్, “సెర్వావాక్‌”, వివిధ వ్యాధులకు అనేక ఇతర టీకాలను తయారు చేస్తున్నామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
 
ఆరోగ్య సంరక్షణ సేవల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలను నివారించడానికి ఇది అవసరమని తెలిపారు. దీని కోసం అనేక అనూహ్యమైన కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. అవసరంలో ఉన్న చివరి వ్యక్తికి కూడా వైద్యం అందించడానికి ప్రభుత్వం చేపట్టిన ‘డాక్టర్స్ ఇన్ వీల్స్’ కార్యక్రమం ఇలాంటిదే అని వివరించారు.