కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 45 శాతానికి డీఏ పెంపు!

 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే డీఏ (కరువు భత్యం ​)ను 45 శాతానికి పెంచేందుకు కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. ఈ నిర్ణయంతో కోటి కన్నా ఎక్కువ మంది ఉద్యోగులు, పింఛనుదారులు లబ్ధి పొందుతారని సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

అంగీకారం కుదిరినట్లుగా కరువు భత్యంను మూడు శాతం పెంచబోతోంది. ప్రస్తుతం 42 శాతం ఇస్తుండగా, మూడు శాతం పెంచి 45 శాతం ఇవ్వబోతోంది. ప్రతి నెలా లేబర్ బ్యూరో వెల్లడించే ‘పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీ’ (సిపిఐ-ఐడబ్ల్యు) ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ వివరాలను తెలిపింది. కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలో లేబర్ బ్యూరో పని చేస్తోంది.

సిపిఐ-ఐడబ్ల్యు ఆధారంగా కరువు భత్యాన్ని నిర్ణయించారు. ఇది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, పింఛనుదారులకు వర్తిస్తుంది. ఎప్పుడు ప్రకటించినా  సంబంధిత డీఏ పెంపుదల​, 2023 జులై 1 నుంచే అమల్లోకి వస్తుంది. చివరిగా 2023 మార్చ్​లో డీఏను కేంద్రం పెంచింది. ఇది 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని వెల్లడించింది. నాడు.. 4 పర్సెంటేజ్​  పాయింట్లను పెంచింది.

నిత్యం పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులకు తరచూ డీఏను పెంచుతుంటాయి ప్రభుత్వాలు. డీఏ పెంపునకు సంబంధించి, కేంద్ర ఆర్థికశాఖ లోని ఖర్చుల విభాగం (ఎక్స్​పెండీచర్​ డిపార్ట్​మెంట్​).. ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని ఓ ప్రదిపాదన చేస్తుంది. ఆ ప్రతిపాదన కేంద్ర కేబినెట్​ ముందుకు వెళుతుంది. కేబినెట్​ ఆమోద ముద్ర వేసిన తర్వాత డీఏ పెంపుదల అమల్లోకి వస్తుంది.