మణిపూర్ ఔట్‌పోస్ట్‌లపై దాడి.. ఆయుధాలు లూటీ

గత మూడు నెలలుగా జాతుల మధ్య ఘర్షణలతో అట్టడుకుతోన్న మణిపూర్‌లో తాజాగా ఓ పోలీస్ అధికారిని అల్లరి మూక పొట్టనబెట్టుకుంది. ఇంఫాల్ వెస్ట్‌లో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా, బిష్ణుపూర్‌ జిల్లాలోని కనీసం రెండు భద్రతా పోస్టులపై దాడికి చేసి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఆటోమేటిక్ గన్‌లను లూటీ చేశారు.
మణిపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకార బిష్ణుపూర్ జిల్లాలోని మణిపూర్ ఆర్మ్‌డ్ పోలీస్ సెకండ్ బెటాలియన్‌కు చెందిన కైరెన్‌ఫాబి, తంగలవాయి పోలీస్ ఔట్‌పోస్ట్‌లపై పురుషులు, మహిళలతో కూడిన ఒక గుంపు దాడిచేసి ఆయుధాలను దోచుకెళ్లింది. హీంగాంగ్, సింగ్‌జమీ పోలీస్ స్టేషన్‌లలో కూడా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని లూటీ చేయడానికి అల్లరి మూక చేసిన ప్రయత్నాలను భద్రతా దళాలు భగ్నం చేశాయి.
కౌత్రుక్, హరోథెల్, సెంజామ్ చిరాంగ్ ప్రాంతాల్లో సాయుధ మూక, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఎదురుకాల్పుల్లో ఒక భద్రతా సిబ్బంది సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇంఫాల్ వెస్ట్‌లోని సెంజామ్ చిరాంగ్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో పోలీస్ అధికారి చనిపోయారు.

సమీపంలోని కొండ ప్రాంతం కౌత్రుక్, సెంజామ్ చిరాంగ్‌లలో అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక గ్రామ వాలంటీర్ గాయపడ్డాడు. బిష్ణుపూర్, చురచంద్‌పూర్ జిల్లాల సరిహద్దులోని ఫౌగక్‌చావో ఇఖాయ్ వద్ద 500-600 మంది గుమిగూడారు. ఆ గుంపును చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ ఘటనలో దాదాపు 25 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

‘గత 24 గంటల్లో కాల్పులు, వివిధ ప్రదేశాలలో వికృత గుంపులు గుమిగూడిన సంఘటనలతో రాష్ట్రంలో పరిస్థితి ఇప్పటికీ అస్థిరంగా, ఉద్రిక్తంగా ఉంది’ అని పోలీసులు ప్రకటించారు. మణిపూర్‌ హిల్, లోయ జిల్లాలు రెండింటిలోనూ మొత్తం 129 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉల్లంఘనలకు సంబంధించి 1,047 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.